Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
పేదలకు పోడు భూములు దక్కేవరకు పోరాటాలు ఆపబోమని, ప్రతిఘటన ఉద్యమాలతోనైనా పోడు భూములను దక్కించుకుంటామని వామపక్ష, ప్రతిపక్ష నాయకులు స్పష్టం చేశారు. సీపీఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో మంగళవారం జరిగిన వామపక్ష, ప్రతిపక్ష పార్టీల సంయుక్త సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి ఆవునూరి మధు, టిజెఎస్ జిల్లా నాయకులు మల్లెల రామనాధం, న్యూడెమోక్రసి జిల్లా నాయకులు మాచర్ల సత్యం, ఎల్.విశ్వనాధం మాట్లాడారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని, పోడు భూముల్లో కుర్చీవేసుకొని పట్టాలు జారీ చేస్తానన్న కేసీఆర్ హామీ నెలలు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదన్నారు. ఇటీవల గ్రామ సభలు నిర్వహించి పోడు పట్టాలకోసం పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఆ దరఖాస్తులను బుట్టదాఖలు చేశారా అని ప్రశ్నించారు. ఓవైపు దరఖాస్తులు తీసుకుంటూనే మరోవైపు ఫారెస్టు అధికారులను ప్రోతహించి దాడులకు ఊసిగొల్పుతున్నారని ఆరోపించారు. ఫారెస్టు, ప్రభుత్వ వేదింపులతో నిరుపేద పోడు సాగుదారులు ఉసురుతీసుకునే పరిస్థితికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు సమస్య పరిష్కారం కోసం ఈ నెల 10న వామపక్ష, ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర నేతల బృందం జిల్లాలోని గుండాల, ఇల్లందు మండలాల్లో పోడు క్షేత్రాలను సందర్శన, సదస్సులు కార్యక్రమంలో పాల్గొంటారని, సీపీఐఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణ జనసమితి రాష్ట్ర అద్యక్షులు కోదండరామ్, న్యూడెమోక్రసి రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క జిల్లా పర్యటనలో పాల్గొంటారని తెలిపారు. పోడు రైతాంగం అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర నేతల పర్యటనను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మచ్చా వెంకటేశ్వర్లు, జాటోతు కృష్ణ, వై.శ్రీనివాసరెడ్డి, జమలయ్య, సురేందర్, నాయిని రాజు, పి.సతీష్, దైవాదీనం, భరత్, వూక్లా, భూక్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గుండాల : పోడు భూముల రక్షణ కోసం ఈ నెల 10న మండల కేంద్రం నుండి ప్రారంభమయ్యే బస్సు యాత్రను విజయవంతం చేయాలని అఖిలపక్ష కమిటీ కన్వీనర్, గుండాల సర్పంచ్ కొమరం సీతారాములు, కో కన్వీనర్ పూనెం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగిన అఖిలపక్ష పార్టీల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ బస్సు యాత్రకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఎంపీపీ ముక్తి సత్యం, పర్శక రవి, లాలయ్య, ఈసం మంగన్న, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడెం వెంకటేశ్వర్లు, సీపీఐ మండల కార్యదర్శి రమేష్, షాహిద్, సీపీఐ(ఎం) నాయకులు సాయనపల్లి సర్పంచ్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.