Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 22 నుండి 26వ తేదీ వరకు జాతర మహోత్సవములు
అ ముస్తాబైన సమ్మక్క, సారలమ్మల గద్దెలు
అ మినీ మేడారం జాతరకు వేళాదిగా తరలి రానున్న భక్త జనం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలోని కొండ కోనళ్ల మధ్య ఛత్తీష్ఘడ్ రాష్ట్ర సరిహద్దులోని మారాయిగూడెం గ్రామంలో వెలసి ఆశేష భక్తుల ఆదరాభిమానాలు చూరగొంటూ మహిమలుగల దేవతలుగా విరాజిల్లుతున్న సమ్మక్క, సారలమ్మ (చిన్న మేడారం) జాతర వేళ అయింది. ప్రతి రెండేళ్లకొక సారి మేడారం తరహాలోనే అచ్చం గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించే మారాయిగూడెం సమ్మక్క-సారలమ్మ జాతరను చిన్న మేడారంగా, ఎజన్సీ ప్రాంత కుంభ మేళాగా పేరుగాంచడంతో పాటు దిన దినాభివృద్ధి చెందుతోంది. ఈ జాతర మహౌత్సవాలకు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఛత్తీష్ఘడ్, ఒడిస్సా రాష్ట్రాలకు చెందిన ప్రజలు, ప్రముఖులు తరలి రానున్నారు. కోరిన భక్తుల కొంగుబంగారంగా కోర్కెలు తీర్చే సమ్మక్క, సారలమ్మలను ఆదివాసీలు కోయవారి ఇలవేల్పులుగా, ఆరాద్యదేవతలుగా కొలుస్తుంటారు. గిరిజన పూజారులచే నిర్వహించే జాతర మహోత్సవముల సందర్బంగా కోయనృత్యాలు, డాన్సులు, డప్పులతో పాటు కొమ్ము నృత్యాలతో అత్యంత వైభవంగా జాతర విశిష్టత తెలిసేలా ఉత్సవాలను నిర్వహిస్తారు.
మండమెలుగుటతో జాతర ప్రారంభం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం మారాయిగూడెం (మినీ మేడారం) గ్రామంలో ఈ నెల 22 నుండి 26వ తేదీ వరకు నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర మహౌత్సవములు మొదటి రోజు మండమెలుగుటతో ప్రారంభం కానున్నాయి. 23వ తేదీ బుధవారం ఒక పొద్దుతో రాత్రి 10 గంటలకు దేవతా నిశానుల నడుమ డప్పులు, డాన్సులు, కోయ నృత్యాలతో జాతర విశిష్టత తెలిసేలా సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలకు తీసుకు వస్తారు. 24వ తేదీ గురువారం చికలల గుట్ట నుండి తల్లి సమ్మక్క అశేష భక్తుల నడుమ మేళతాళాయి, మంగళవాయిద్యాలు, గిరిజన సాంప్రదాయ నృత్యాలు, దేవతా నిశానులతో గద్దెకు చేరుకోవడంతో నిండుజాతర ప్రారంభం అవుతుంది. 25వ తేదీ శుక్రవారం సుంకు పండుగ సందర్భంగా భక్తులు సాంప్రదాయ మొక్కులు చెల్లించడంతో పాటు బెల్లం (బంగారం) అందజేస్తారు. 26వ తేదీన తల్లి సమ్మక్క జనం నుండి వనంలోకి తరలి వెళ్లడంతో నిండు జాతర ముగుస్తుంది.