Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ రాష్ట్ర నాయకులు ఎం.సాయిబాబు, బత్తుల హైమావతి
ఖమ్మం సీపీఐ(ఎం) జిల్లా ఆఫీసులో ఘనంగా నివాళులు
నవతెలంగాణ-ఖమ్మం
సీపీఐ(ఎం) పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పర్సా సత్యనారాయణ సతీమణి పర్సా భారతి అకాల మరణం పార్టీకి, ప్రజా సంఘాలకు తీరని లోటని సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు యం.సాయిబాబు అన్నారు. కామ్రేడ్ కళ్యాణం వెంకటేశ్వరరావు అధ్యక్షతన సుందరయ్య భవనంలో జరిగిన సంతాపం సభలో ఆయన మాట్లాడుతూ పర్సా భారతి పర్సా సత్యనారాయణ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా ఉద్యమాలు నిర్వహించారని, కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పైన రాజీలేని పోరాటాలు చేశారని, కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయటం, వాటిని చివరిదాకా ఆచరణలో పెట్టిన మహనీయురాలు అని అన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ బత్తుల హైమావతి మాట్లాడుతూ మహిళా ఉద్యమాలు, కార్యక్రమాలకు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. పర్సా సత్యనారాయణ చూపిన బాటలో చివరికంటా ఉన్నారని తెలిపారు. పర్సా భారతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, బండి రమేష్, జిల్లా కమిటీ సభ్యులు బండి పద్మ, విష్ణు, ఆర్.ప్రకాష్, పి.రమ్య, నండ్ర ప్రసాద్, వూరడి సుదర్శన్ రెడ్డి, నాయకులు, వాసిరెడ్డి వీరభద్రం, రామారావు, కత్తుల అమరావతి, భాగం అజిత, బేగం తదితరులు పాల్గొన్నారు.
విజయవాడలో పార్థివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించిన జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
కార్మికోద్యమ నిర్మాత కామ్రేడ్ పర్సా సత్యనారాయణ సతీమణి, మహిళా కార్మికోద్యమంలో కీలక భాగస్వామి అయిన పర్సా భారతి మరణం కార్మిక, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని, భారతి గారి మరణానికి సి.పి.ఎం. ఖమ్మం జిల్లా కమిటి సంతాపం తెలియజేస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలో పర్సా భారతి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమంలో పర్సాతో పాటు ఆమె ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ అనేక పోరాటాలకు, ఉద్యమాలకు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన వారిలో నున్నా నాగేశ్వరరావుతో పాటు గోపి, రమణ తదితరులు వున్నారు.