Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి బాలరాజు
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పేరిట జరుగుతున్న వేల కోట్ల కుంభకోణంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ(ఎం) కొత్తగూడెం పట్టణ కార్యదర్శి లిక్కీ బాలరాజు డిమాండ్ చేశారు. స్థానిక మంచికంటి భవన్లో జరిగిన పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పాలకవర్గం ఏర్పడిన రెండు సంవత్సరాల కాలంలో అభివృద్ధి పనుల పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేసి అధికారులు ప్రజా ప్రతినిధులు కుమ్మక్కై వేల కోట్లు కైంకర్యం చేశారని ఆరోపించారు. ప్రధానంగా పాత డిపో నుండి రామవరం 14 నెంబర్ వరకు నిర్మించిన రోడ్లు డివైడర్ నిర్మాణం, మొక్కల పెంపకం పేరుతో మొక్కల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడి ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. కోవిడ్ సెంటర్ల దగ్గర ఏర్పాటు చేసిన సౌకర్యాల పేరుతో, పట్టణ పరిధిలో విద్యుత్ సామాగ్రి, బ్లీచింగ్, కిన్నెరసాని పైపులైను మరమ్మతులు, బతుకమ్మ పండుగ వేడుకలు, మంత్రుల పర్యటన, మున్సిపల్ ఉద్యోగులకు నిర్వహించిన క్రికెట్ పోటీల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారన్నారు. సెంట్రల్ లైటింగ్, రహదారుల మరమ్మతులు, వైకుంఠ ధామాలు, మినీ పార్కులు, క్రీడా సామాగ్రి కొనుగోలు అలాగే క్రీడలు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నూతనంగా నిర్మించిన మాతా, శిశు హాస్పిటల్ నిర్మాణంలో మున్సిపాలిటీ సొమ్మును ఖర్చు చేశామని తప్పుడు బిల్లులతో అవినీతికి పాల్పడ్డారు. ఆరోపణలు ఉన్నాయని దీనిపై తక్షణమే పాలక కౌన్సిల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు ప్రజా ప్రతినిధులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రజా ధనాన్ని, ప్రజా సంక్షేమం, పట్టణ అభివృద్ధి కొరకు ఖర్చు చేసేలా జవాబుదారీ తనం ఉండేలాగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్టణ కమిటీ సభ్యులు సందకూరి లక్ష్మి, జునుమాల నగేష్ డి.వీరన్న తదితరులు పాల్గొన్నారు.