Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ముదిగొండ
రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారంతో వరి, మొక్కజొన్న పంటకు ప్రత్యామ్నాయంగా పోద్దుతిరుగుడు (సీన్ ఫ్లవర్) సాగు చేసిన రైతులు నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టం పోయారని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు అన్నారు. మండల పరిధిలో గోకినేపల్లి గ్రామంలో నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో యాసంగి సీజన్లో పోద్దు తిరుగుడు పంటను 40 మందిి రైతులు సాగు చేసి రెండు నెలల అయినా పంట ఎదుగుదల లేకుండా పూత వచ్చిన పంటను శుక్రవారం తెలంగాణ రైతు సంఘం బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించింది. అనంతరం ముదిగొండ మండల వ్యవసాయ కార్యాలయం వద్ద నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, విత్తన కంపెనీపై చర్య తీసుకోవాలని రైతులు ధర్నా నిర్వహించారు. వ్యవసాయ అధికారి మందుల రాధకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు మాట్లాడుతూ రైతుల అవసరాలను సొమ్ము చేసుకుంటూ విత్తన కంపెనీలు నకిలీ విత్తనాలు విక్రయం చేయడం జరిగిందన్నారు. మహారాష్ట్ర పుణెలో ఉన్న ''మాన్ షున్ ఎఫ్ వన్ సన్ గోల్డ్'', కంపెనీ లేబుళ్లు అంటించిన విత్తన ప్యాకెట్లు గద్వాల కేంద్రంగా రైతులకు విక్రయించడం జరిగిందని, కొందరు రైతులు వేసిన విత్తనాలు ప్రారంభంలోనే మొలకెత్తేలేదన్నారు. ప్రస్తుతం ఉన్న పంట కాపు దశ లేదని, ఒక్కటి, రెండు మొక్కలు కాపువచ్చి ఒక పువ్వుకి బదులు ఇరవై, ముప్పైగుంపులు ఏర్పడి ఎర్రికాపు వచ్చిందని, స్పష్టంగా నకిలీ విత్తనాలుగా అర్ధం అవుతుందన్నారు. రైతులు ఎకరాకు నలబై, ఏభై వేల రూపాయలు ఖర్చు పెట్టి, పంటకాపు దశలో నష్టపోతున్నారని, జిల్లా అధికారులు వెంటనే స్పందించి నకిలీ విత్తనాలపై విచారణ జరిపి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు వాసిరెడ్డి వరప్రసాద్, మండల కార్యదర్శి కందుల భాస్కరరావు, సిపిఐ(ఎం) మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, వైస్ ఎంపీపీ మంకెన దామోదర్, నాయకులు, పయ్యావుల పుల్లయ్య, మందరపు వెంకన్న, రైతులు ఎస్కె సోద్దు, పి.రామారావు, వీరయ్య, శ్రీనివాసరావు, రామకృష్ణ, రామయ్య, యుగంధర్, చంద్రయ్య పాల్గొన్నారు.