Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- దుమ్ముగూడెం
విద్యుద్ఘాతంతో ఇల్లు దగ్ధమైన సంఘటన శుక్రవారం సాయంత్రం లచ్చి గూడెం గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... లచ్చిగూడెం గ్రామానికి చెందిన కారం నరసింహారావు, జయమ్మ దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. జయమ్మ తమ బంధువులకు సంబంధించిన దశదినకర్మలు ఉండటంతో పక్క ఊరు వెళ్ళింది. నరసింహారావు గ్రామంలో గల తన అన్నయ్య ఇంటి వద్దకు పెళ్లి పనులు చూసుకోవడానికి వెళ్ళాడు. సుమారు 7 గంటల సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఒక్కసారిగా పెద్దపెద్ద మంటలు ఎగిసి పడ్డాయి. మంటలు అదుపులోకి రాకపోవడంతో ఇల్లు మొత్తం పూర్తిగా కాలిపోయింది.
కట్టుబట్టలే మిగిల్చిన అగ్నిప్రమాదం :
శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదం ఆ కుటుంబానికి కట్టు బట్టలే మిగిల్చాయి. బాధితుడు నరసింహారావు కాలిపోయిన ఇంటి వద్ద కన్నీటి పర్యంతం అవుతున్న తీరు ప్రతి ఒక్కరిని కలచివేసింది. ఇటీవలే పత్తి అమ్మిన సుమారు రూ.70 వేలు బీరువాలో పెట్టానని, తన భార్యకు సంబంధించిన బంగారు పుస్తెలతాడుతో పాటు రెండు జతల వెండి పట్టీలు, 30 బస్తాల ధాన్యం, రెండు డబుల్ కాట్ మంచాలు, టీవీ ఇంటి సామగ్రి, ఆధార్. బ్యాంకు పట్టాదారు పాసు పుస్తకాలు కాలి బూడిద అయ్యాయని కన్నీటి పర్యంతమయ్యాడు.