Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ చెక్కుల పంపిణీలో విప్ రేగా
నవతెలంగాణ-అశ్వాపురం
నిరుపేద కుటుంబాలకు వరం కల్యాణ లక్ష్మి పథకం అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వాలు పెట్టని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం అర్హులైన 70 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచర్ల వీరభద్రం, సర్పంచ్ భానోత్ శారద, ఎంపీటీసీ గంగాభవాని, నరేష్, మర్రి మల్లారెడ్డి, వెంకటరమణ, తహసిల్దార్ వి.సురేష్ కుమార్ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి ఎంపీపీ, జడ్పీటీసీ గైర్హాజరు
తేటతెల్లమైన గ్రూఫుల రగడ
మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు పంపిణీ చేసిన కల్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎంపీపీ ముత్తినేని సుజాత, జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణలు గైర్హాజరయ్యారు. వారు పాల్గొనకపోవడంతో పలువురు గుసగుసలాడారు. ఇప్పటికే మండలంలో టీఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిందనే వాదన బలంగా వినిపిస్తున్న తరుణంలో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మహిళా ప్రజాప్రతినిధులు ఇద్దరూ హాజరు కాకపోవడంతో ఇది మరింత బలపడింది. అంతేకాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇటువంటి కార్యక్రమానికి మండలానికి చెందిన ప్రముఖ నాయకులు ఎవరూ హాజరు కాకపోవడం విస్మయానికి గురిచేసింది. రానున్న కాలంలో ఈ గ్రూఫులో రగడ ఏ సంకేతాలకు దారితీస్తుందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.
మణుగూరు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దేశంలోనే అత్యుత్తమ సంక్షేమ పథకాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం తహాసీల్దార్ కార్యాలయంలో 91 మందికి కల్యాణలక్ష్మీ, 11 మందికి షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మైనార్టీ పేదలకు ఇంటికి పెద్ద కొడుకులా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో కేసీఆర్ సంక్షేమ పథకాలు ఉపయోగపడుతున్నాయన్నారు. తహసీల్దార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మెన్ కుర్రి నాగేశ్వరరావు, పగిడేరు ఎంపీటీసీ కృష్ణకుమారి, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.