Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఏ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారని
విద్యార్థులతో ముఖాముఖి
అ జిల్లా గ్రంధాలయాన్ని
సదర్శించిన కలెక్టర్
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు సన్నద్ధం అయ్యే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆధునాతన డిజిటల్ గ్రంధాలయ నిర్మాణానికి డిజైన్లు తయారు చేయాలని, పోటీ పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడేలా గ్రంధాలయాలు ఉండాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని జిల్లా కేంద్ర గ్రంధాలయాన్ని, నూతన గ్రంధాలయం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా కేంద్ర గ్రంధాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులతో మీరు...ఏ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారని... ముఖాముఖి నిర్వహించారు. కొత్తగూడెంతో పాటు ఇల్లందు, పాల్వంచ, భద్రాచలంలో గ్రంధాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్ధులు ఇంటి వద్ద చదువుకోవడానికి అవకాశం లేకపోవడం వల్ల గ్రంధాలయూలకు వస్తున్నారని, మంచిగా చదువుకునే వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఎంలైనా ఉందని చెప్పారు. ప్రధాన రహదారి ప్రక్కనున్నందున నిత్యం రద్దీతో వాహనాల ద్వారా శబ్ద కాలుష్యంతో పాటు విద్యార్థులు కూర్చోవడానికి కూడా కుర్చీలు లేవని, ఎక్కువ సేపు కూర్చుని చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెప్పగా విద్యార్థులు కోరిన విధంగా సౌకర్యాలు కల్పనకు ప్రతిపాదనలు అందచేయాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. మంచి విద్యుత్ వెలుగులు ఇచ్చే లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. వాహనాల శబ్దాన్ని ఆపగలిగే అద్దాలు ఏర్పాటు చేయాలని, సౌకర్యంగా కూర్చొనే కుర్చీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉన్నపుడే విద్యార్థులు మంచిగా చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. విద్యార్ధులు ప్రశాంతంగా మానసిక ఒత్తిడి లేకుండా చదువుకునే వాతావరణం కల్పించడానికి గ్రంధాలయం ఖాళీ స్థలంలో మొక్కలు నాటి అందమైన లాన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. గ్రంథాలయ పరిసరాలు మొత్తం పరిశీలించి, అందమైన వాల్ పెయింటింగ్స్ వేయించాలని చెప్పారు. విద్యార్థులకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ పుస్తకాలు, మ్యాగజైన్లు, తెలుగు అకాడమీ పుస్తకాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రంథాలయపు పనివేళలు ఉదయం 6 నుండి రాత్రి 10 వరకు పెంచాలని, సమయం పెంచడం వల్ల చదువుకోవడానికి ఎక్కువ ఉపయోగం ఉంటుందని విద్యార్థులు కోరగా పరిశీస్తామని చెప్పారు. గ్రంధాలయానికి దాతలు వితరణ ఇచ్చిన పుస్తకాలను పరిశీలించి అభినందించారు. కొత్తగూడెంతో పాటు ఇల్లందు, పాల్వంచ, భద్రాచలం ప్రాంతాల్లో విద్యార్థులు ఉద్యోగ సాధనకు ఉపయోగపడే పుస్తకాలతో పాటు డిజిటల్ గ్రంధాలయం ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం చుంచుపల్లి మండలంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద నూతన గ్రంధాలయం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, కార్యదర్శి మంజువాణి, కార్యాలయ ఇన్చార్జ్ నవీన్ జిల్లా కలెక్టర్‌ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, కార్యదర్శి మంజువాణి, కార్యాలయ ఇన్చార్జ్ నవీన్, గ్రంథపాలకులు వరలక్ష్మి, మణి మృధుల, ఇన్చార్జీ మున్సిపల్ కమిషనర్ నవీన్, తహసిల్దార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.