Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్ముగూడెం మండలం పూర్తి వ్యవశాయ ఆధారిత మండలం. మండలంలో గిరిజన, గిరిజనేతర రైతులు వరి, పత్తితో పాటు మిర్చి సాగు చేస్తుంటారు. పత్తి పంటను మాత్రం అత్యధికంగా గిరిజన రైతులే సాగు చేస్తుంటారు. దీంతో పాటు మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీష్‌ఘడ్‌లో సైతం గిరిజనులు ఎక్కువ మొత్తంలో పత్తి పంటను సాగు చేస్తుంటారు. మండలంలో ఈ ఏడాది సుమారు 20 వేల ఎకరాలలో పత్తి సాగు చేశారు. ఇక్కడ పత్తి సాగు చేస్తున్న రైతులు పండించిన పత్తిని దళారులకు విక్రయిస్తూ మోసపోతూనే ఉన్నారు. ఈ ఏడాది సీసీఐ రేటు తక్కువగా ఉండడంతో ప్రైవేటు వ్యాపారులు ఇష్టారాజ్యంగా పోటీలు పడుతూ పత్తి కొనగోళ్ల పేరుతో గ్రామాల్లో కాటాల మోసాలకు పాల్పడుతున్నారు. పత్తి కోనుగోళ్ల పేరుతో దళారులు టాటా ఏసి, అశోక్‌లేలాండ్, అప్పీ వాహనాల ద్వారా తల్లాడ, ఏన్కూర్, అన్నపరెడ్డిపల్లి, మద్దిగూడెం, చండ్రుగొండ, బంజరు తదితర ప్రాంతాల నుండి పత్తి కొనుగోళ్లకోసం దుమ్ముగూడెం మండలంతో పాటు చత్తీష్ఘడ్లో పలు ప్రాంతాలకు వస్తుంటారు. పత్తి కొనుగోళ్లను దళారులు రాత్రి సమయంలో కూడా కొనసాగిస్తుంటారు. గత నెల రోజుల క్రితం గౌరవరం, రామచంద్రాపురం గ్రామాల్లో కాటాలో మోసాలకు పాల్పడుతున్న దళారులను రైతులు నిలదీయడంతో పాటు వారిపై పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేశారు. తాజాగా ఆదివారం మండల సరిహద్దు గ్రామమైన మారాయిగూడెం గ్రామంలో కాటాలో మెసాలకు పాల్పడుతున్న దళారులను అక్కడి గిరిజన రైతులు గుర్తించి వారిని నిలదీశారు.
కంప్యూటర్ కాటాతో మోసాలు
దళారులు వారి వెంట తెచ్చుకున్న కంప్యూటర్ కాటాకు చిప్ అమర్చి రిమోట్ సిస్టం ద్వారా హైటెక్ దందాకు తెరలేపారు. పత్తి బోరెటు కాటా వేస్తున్న సమయంలో వారి వద్ద ఉన్న రిమోట్‌ను రైతులకు తెలియకుండా ఆపరేట్ చేస్తున్నారు. ఇలా చేయడం వలన ఒక్కో బోరెంకు 40 కేజీలు తక్కువగా వస్తుంది. అనుమానం వచ్చిన గిరిజన రైతులు గుర్తించి దళారుల వద్ద ఉన్న రిమోట్ లాక్కున్నారు. వారిలో ఒక వ్యక్తి కంప్యూటర్ కాటా ఎక్కి బరువు పరీశీలించగా సుమారు 77 కేజీలు ఉన్న అట్టి వ్యక్తి బరువు 37 కేజీలు మాత్రమే చూపి స్తుంది. దీనిని బట్టి ఒక్కో బోరెంకు 40 కేజీల పత్తి రైతులు మోసం పోతున్నారు. కాగా పత్తి కోసం వచ్చిన దళారులను, వాహనాలను గ్రామంలో ఉంచినట్లు సమాచారం..
చోద్యం చూస్తున్న అధికారులు
పత్తి కొనుగోళ్ల పేరుతో దళారులు కంప్యూటర్ కాటాతో తూకాలు వేస్తూ గిరిజనులను మోసం చేస్తున్నా తూనికల కొలతల అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు విన్పి స్తున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో దళారులు చేస్తున్న మోసా లకు చెక్ పెట్టేలా ప్రభుత్వ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పవచ్చు.