Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-మణుగూరు
పోడు భూముల దరఖాస్తుల విచారణ పూర్తయ్యేంత వరకూ దరఖాస్తు చేసుకున్న పోడు భూముల జోలికి వెళ్లొద్దని చట్టం చెబుతుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక శ్రామిక భవనంలో పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ దరఖాస్తుదారులపై విచారణ జరిపి ఆ భూమిని అతనిది కాదని నిరూపణ అయ్యేంత వరకూ ఆ భూముల జోలికి వెళ్లద్దని హెచ్చరించారు. పోడు సాగుదారులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించే ప్రభుత్వం మళ్లీ తేదీ పొడగించిందన్నారు. చట్టంలో లేని విధానాలను ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు అమలు చేస్తూ చట్టవిరుద్దంగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఫారెస్ట్ అధికారుల సమావేశం నిర్వహించిన నాటి నుండి దాడులు పెరిగాయే తప్పా, తగ్గలేదన్నారు. పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తానని చెప్పిన విప్ రేగా కాంతారావు దాడులు జరుగుతుంటే ఖండించకపోవడం దారుణమన్నారు. సీతమ్మబ్యారేజ్ కరకట్ట ద్వారా భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.4 లక్షలు నష్ట పరిహారం ఇవ్వడం దారుణమన్నారు. వారికి ఎకరానికి రూ.12 లక్షలు చెల్లించారన్నారు. అదే విధానాన్ని సీతమ్మ బ్యారేజ్, రైల్వే లైన్ భూ నిర్వాసితులకు వర్తింపజే యాలన్నారు. సీతమ్మ బ్యారేజ్ వలన రైతులకు తీవ్ర నష్టం జరుతుందన్నారు. మణుగూరు నుండి బీటీపీఎస్ రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోయినా నిర్వాసితులకు పూర్తిగా ప్యాకేజీ ఇవ్వకముందే నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రైల్వే లైన్ భూ నిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేయాలని, అర్హులైన నిర్వాసితులందరికీ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొడిశాల రాములు, కార్యదర్శి వర్గ సభ్యులు కృష్ణకుమారి, ఉప్పతల నర్సింహారావు, టివిఎంవి ప్రసాద్, నర్సింహారావు, నాగమణి, ఈశ్వరరావు, ఉత్తమ్, నాగేశ్వరరావు, సుధాకర్, పద్మ, శివప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.