Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
ఆసియాలోనే అతిపెద్ద జాతర శ్రీ మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల మండలంలోని యాపలగడ్డ నుండి పగిడిద్దరాజు వెళ్తేనే అక్కడ జాతర ప్రారంభం అవుతుంది. ఎందుకంటే సమ్మక్క భర్త పగిడిద్దరాజు యాపలగడ్డ గ్రామానికి చెందిన అరెం వంశీయుడు. ప్రతి రెండేండ్లకు ఒకసారి జరిగే జాతరకు అక్కడ మేడారంకు ఇక్కడ యాపలగడ్డకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మేడారంలో జాతర ప్రారంభానికి రెండు రోజుల ముందు ఇక్కడి నుండి పగిడిద్దరాజు మేడారం వెళ్లాల్సి ఉంటుంది. అందులో భాగంగానే సోమవారం యాపలగడ్డ సమీపంలోని పగిడిద్దరాజు గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి డోలి చప్పుళ్ళతో, శివసత్తుల పూనకాలతో పగిడిద్దరాజును తొట్టివాగు దగ్గరి గద్దెల మీదకు తీసుకువచ్చి గద్దెల దగ్గర పూజలు చేశారు. అనంతరం ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం యాపలగడ్డ నుండి పగిడిద్దరాజు సాయంత్రం 5 గంటలకు కాలినడకన బయలుదేరి ములుగు జిల్లాలోని లింగాల సమీప అడవుల్లో సోమవారం రాత్రి బసచేస్తారు. మంగళవారం ఉదయం లింగాల నుండి పస్రా సమీపంలోని మొద్దులగూడెం లక్ష్మీపురం చేరుకుని, బుధవారం తెల్లవారుజామున పోలీసు బందోబస్తు నడుమ మేడారం దగ్గర గర్భగుడికి చేరుకుంటారు. కొండాయి నుండి దబ్బకట్ల వంశీయులు గోవిందరాజును, కన్నేపల్లి నుండి కాకా వంశీయులు సారలమ్మను కూడా అదే గర్భగుడికి తీసుకువెళ్తారు. యాపలగడ్డ నుండి అరెం వంశీయులు పగిడిద్దరాజును, కొండాయి నుండి దబ్బకట్ల వంశీయులు గోవిందరాజును, కన్నేపల్లి నుండి కాకా వంశీయులు సారలమ్మలను గర్భగుడికి తీసుకువెళ్లిన అనంతరం బుధవారం రాత్రి 10-00 గంటలకు మేడారం గద్దెల మీద పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మలను ప్రతిష్టించిన తర్వాత జాతర ప్రారంభం అవుతుంది. మరుసటి రోజు గురువారం సమ్మక్క గద్దెల మీదకు చేరుకోవడంతో అమ్మవార్ల మహాజాతరకు ఊపు వస్తుందని యాపలగడ్డ గ్రామానికి చెందిన అరెం వంశీయులు చెప్పారు. పగిడిద్దరాజును మేడారం తీసుకువెళ్లిన వారిలో తలపతులు అరెం అప్పయ్య, లక్ష్మీనర్సు, నారాయణ, నాగయ్య, బుచ్చయ్య, బిక్షం, కాంతారావు, సమ్మయ్య, సత్యం, బసవయ్య తదితరులు ఉన్నారు.