Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నదానాలు, రక్తదానాలు చేద్దాం
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు నేపధ్యంలో ఈ మూడు రోజులూ అంటే నేటి (మంగళవారం) నుంచి టీఆర్ఎస్ శ్రేణులు పండుగలా జరపాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పార్టీ శ్రేణులను కోరారు.
సోమవారం స్థానిక క్యాంపు కార్యాల యంలో ఎస్సీ కార్పొరేషన్ రుణ లబ్దిదారుల చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే సేవా కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు అన్నదాన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అలాగే రెండోరోజు సత్తుపల్లి మున్సిపాలిటీ ఆవరణలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుం దన్నారు. ఇక కేసీఆర్ జన్మదినం రోజున టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ సారధ్యంలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలిపేలా వినూత్న రీతిలో చిత్రపటాన్ని గీయించడం జరుగుతుం దన్నారు. 10 రోజుల్లోగా సత్తుపల్లి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచిపెట్టనున్న అర్బన్ పార్కును ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు.
తెలంగాణపై మోడీ ప్రభుత్వం విషం గక్కుతోంది....
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల విషం గక్కుతోందని ఎమ్మెల్యే సండ్ర మండిపడ్డారు. విభజన హామీలు నెరవేర్చడం లేదన్నారు. ఏ ఒక్క ప్రాజెక్టుకు రూపకల్పన చేయలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలను చూసి కుమిలిపోతోందన్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ వేస్తున్న ఎత్తుగడలను తిప్పికొట్టేలా సమాయత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఎంపీపీ దొడ్డా హైమవతి శంకరరావు, జెడ్పీటీసీ కూసంపూడి రామారావు, ఎంపీడీవో సుభాషిణి, నాయకులు దొడ్డా శంకరరావు, కృష్ణారావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎస్కే రఫీ, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ తోట సుజలారాణి, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, చాంద్‌పాషా, అద్దంకి అనిల్‌కుమార్, రఘు, అమరవరపు విజయనిర్మల పాల్గొన్నారు.