Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే రేగా
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మండల కేంద్రంలో నిర్మించిన 60, మర్కోడు గ్రామంలో నిర్మించిన 40 డబుల్ బెడ్ రూం ఇండ్లను పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చేతుల మీదుగా లాటరీ పద్ధతిలో లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ మేరకు మంగళవారం రేగా కాంతారావు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం డబుల్ బెడ్ రూం ఇండ్లు వచ్చిన లబ్దిదారులు అదృష్టవంతులని, ప్రభుత్వ డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల జాబితాలో అవకతవకలు జరగకుండా, పారదర్శకత పాటించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. ఏ పార్టీ వారైనా సరే అర్హులైన పేదవారైతేనే ప్రభుత్వ డబుల్ బెడ్ రూం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు ఇల్లు వచ్చిన 100 మంది లబ్ధిదారులపై పూర్తి ఇండ్ల సంబంధిత వివరాలు మరోసారి ప్రత్యేక దర్యాప్తు చేపడతామని, అనర్హులు ఉంటే సత్వరమే ఇల్లు వెనక్కి తీసుకుంటామని తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా పలు అంశాలపై స్థానిక తహశీల్దార్, ఎంపీడీవోల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కల్యాణ లక్ష్మి చెక్కు లబ్ధిదారురాలికి పంపిణీ చేశారు. తదనంతరం ప్రభుత్వ ఆసుపత్రి క్వార్టర్స్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. దీనికి ముందు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తొలిసారి మండలంలో విచ్చేయడంతో స్థానిక మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. స్థానిక ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి, జెడ్పీటీసీ కొమరం హనుమంతరావు పుష్పగుచ్చం అందించి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ డీఈ రాజు, స్థానిక తహశీల్దార్ మొహమ్మద్ సాదీయా సుల్తానా, ఎంపీడీవో ఎం.మంగమ్మ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు, కాంట్రాక్టర్లు వాసు, యూసుఫ్ అలీ, టీఆర్ఎస్ స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.