Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మాజీ ఎంపీ మిడియం బాబురావు
నవతెలంగాణ-భద్రాచలం
కేంద్ర బడ్జెట్ దేశంలోని గిరిజనుల అవసరాలను అస్సలు పట్టించుకోకుండా ఘోరమైన ద్రోహం చేసిందని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ (ఎఎఆర్ఎం) జాతీయ చైర్మెన్, మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబురావు విమర్శించారు. భద్రాచలంలో గిరిజన అభ్యుదయ భవన్లో కేంద్ర బడ్జెట్ ఆదివాసీలు అనే అంశంపై తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో పేర్కొన్నట్లుగా ఇది అమృత కాలం కాదని, గిరిజనులకు విషకాలమని వ్యాఖ్యానించారు. ఆకలి, నిరుద్యోగం, జీవనోసాధులు లేకపోవడం వంటి సమస్యలు గిరిజన కమ్యూనిటీలను వేధిస్తున్నాయని ఆయన విమర్శించారు. వీటిని పరిష్కరించేందుకు ఈ బడ్జెట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వేసిన పాత అంచనాల ప్రకారమే ఎస్టీలకు మొత్తం బడ్జెట్లో 8.6శాతం వ్యయం కేటాయించాలని, తాజా అంచనాల ప్రకారం కేవలం 2.26శాతం కేటాయించారని ఆయన అన్నారు. ఈ ఏడాది ఆహార సబ్సిడీని రూ.80వేల కోట్ల మేర తగ్గించారని, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.25వేల కోట్లు తగ్గించారని ఆయన విమర్శించారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాలకు కేటాయింపుల్లో కోత పెట్టడం వల్ల గిరిజనులు తీవ్రంగా ప్రభావితమవుతారని ఆయన పేర్కొన్నారు. అడవులను కార్పొరేట్లు అప్పగించే ప్రతిపాదనలు చేశారని ఆయన విమర్శించారు. గత బడ్జెట్లో కేటాయించిన రూ.87,473 కోట్లలో 50శాతం కూడా ఖర్చు చేయని దుర్మార్గమని అన్నారు. 2022-23 బడ్జెట్లో రూ.89,265 కోట్లు కేటాయింపులు చేసినా గిరిజనులకు ఉపయోగం లేని రంగాల్లో అధిక కేటాయింపులు జరిగాయని, గిరిజనుల అభివృద్ధికి ఒక కొత్త పథకం లేదని పేర్కొన్నారు. గిరిజన యూని ర్సిటీ ఏర్పాటు చేయలేమని బడ్జెట్లో చెప్పేశారని, గత బడ్జెట్లో రూ.2 కోట్లు కేటాయించి రూ.47లక్షలు మాత్రమే సవరించిన అంచనాలో చూపి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆయన అన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో రూ.50 లక్షలు తగ్గించి రూ.1 కోటి 50 లక్షలు కేటాయించారని ఆయన అన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ అసలే లేదని, కరోనాలో చితికిపోయిన గిరిజన బతుకులకు ఆదరువు కరువుగా మారిందని, కనీసం నగదు బదిలీ పథకమైనా ప్రకటించలేదని ఆయన అన్నారు.
ఈ సెమినార్లో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వజ్జ సురేష్, సరియం కోటేశ్వర రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కారం పుల్లయ్య, సున్నం గంగ, మడివి రమేష్, దుబ్బ గోవర్ధన్, పాయం నర్సింహారావు, రవ్వ దేవరాజు, రమేష్, మడివి నందిని, తదిత రులు పాల్గొన్నారు.