Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
పీడిత ప్రజల పక్షాన పోరాడటమే వేదగిరి శ్రీనివాస్‌కి ఇచ్చే ఘనమైన నివాళి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. స్థానిక మంచికంటి భవన్లో శుక్రవారం వేదగిరి శ్రీనివాస్ రెండో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వేదగిరి చిత్రపటానికి అన్నవరపు కనకయ్య, మచ్చా వెంకటేశ్వర్లు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేదగిరి తన తుది శ్వాస వరకు వ్యవసాయ కార్మికులు పేద ప్రజలు తరుఫున పోరాటం చేశారని ఆయన కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన ఎర్రజెండాను తుది శ్వాస వరకు మోసాడని ఆయన అన్నారు. వైరా ఎంపీపీగా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేసి ప్రజా ప్రతినిధిగా విప్లవకారుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారన్నారు. వేదగిరి భౌతికంగా లేనప్పటికీ ఆయన మిగిల్చిన ఆశయం కమ్యూనిస్టు కార్యకర్తలు ముందుందన్నారు. ప్రస్తుత పాలక ప్రభుత్వాలు కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే విధానాలు చేస్తూ సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికులకు, పేద ప్రజలకు ఆసరాగా ఉన్నటువంటి ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచి ఆ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉపాధి హామీ పథకాన్ని పటిష్ఠంగా అమలు చేయడానికి భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని వ్యవసాయ కార్మికుల పక్షాన పోరాడటమే వ్యవసాయ కార్మిక నాయకుడిగా తన జీవితాంతం పనిచేసిన వేదగిరి శ్రీనివాస్ ఇచ్చే ఘనమైన నివాళి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, భూక్య రమేష్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మందా నరసింహారావు, యంవి అప్పారావు, కె.సమ్మయ్య, ఎస్.లక్ష్మి, జునుమాల నగేష్, రాజారావు, రాయమల్లు, కెహెచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.