Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జనం వనానికి చేరుకున్న వనదేవతలు
నవతెలంగాణ-గుండాల
ఈ నెల 16 నుండి 19 వరకు జరిగిన ఆదివాసీ గిరిజన జాతర శనివారంతో ముగిసింది. ఆసియాలోనే అత్యంత గుర్తింపు కలిగిన అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని యాపలగడ్డ నుండి పగిడిద్దరాజు వెళ్తేనే మేడారం జాతర ప్రారంభమవుతుందన్న విషయం తెలిసిందే! అందులో భాగంగానే ఈ నెల 14న యాపలగడ్డ నుండి పగిడిద్దరాజు కాలినడకన బయలుదేరి 75 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి 16న మేడారం చేరుకున్న సంగతి విధితమే! అయితే 16న ప్రారంభమైన జాతర మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగింది. 19న శనివారం జాతర సమాప్తం కావడంతో దేవతలు జనం నుండి వనం బాట పట్టారు. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నేపల్లికి సారలమ్మ, కొండాయికి గోవిందరాజు చేరుకోగా పగిడిద్దరాజు మాత్రం శనివారం రాత్రి మేడారం నుండి కాలినడకన బయలుదేరి ఆదివారం సాయంత్రం యాపలగడ్డ చేరుకున్నారు. పగిడిద్దరాజు వంశస్థులు అయిన అరెం వంశీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో పగిడిద్దరాజును యాపలగడ్డ సమీపంలో గల గర్భగుడిలో ఉంచారు. వచ్చే నెల మొదటి వారంలో యాపలగడ్డ గ్రామంలో పగిడిద్దరాజు జాతరను అత్యంత వైభవంగా జరపనున్నట్టు అరెం వంశీయులు చెప్పారు. మేడారం నుండి పగిడిద్దరాజును తీసుకువచ్చిన వారిలో అరెం అప్పయ్య, లక్ష్మీనర్సు, నారాయణ, నాగయ్య, బుచ్చయ్య, బిక్షం, కాంతారావు, సమ్మయ్య, సత్యం, బసవయ్య తదితరులు ఉన్నారు.