Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం లీగల్
భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్థలు గృహహింస కేసులు కారాదని, కుటుంబ బాంధవ్యాలు సున్నితంగా పరిగణించి తగు చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జావీద్ పాషా చెప్పారు. ఖమ్మం సఖి కేంద్రంలో గృహహింస చట్టంపై నిర్వహించిన అవగాహనా సదస్సుకు న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ విలువలను వాటి పటిష్టానికి పెద్దలు తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించారు. సమిష్టి కుటుంబాలు విచ్ఛన్నం కావడం వల్ల యుక్త వయస్సు భార్యభర్తల మధ్య తలెత్తే చిన్న చిన్న తగాదాలు ముదిరి కేసులుగా మారుతున్నాయన్నారు. కేసులుగా మారిన వివాదంలో కోర్టు వాయిదాలకు హాజరయ్యే క్రమంలో పిల్లలను కూడా తీసుకుని రావడం వల్ల వారి భవిష్యత్ దెబ్బంతింటుందని ఆవేదన వ్యక్తంచేశారు. మహిళ కూతురుగా మరియు తల్లిగా బాధ్యతలు సక్రమంగా నిర్వహించినా, అత్తగా, కోడలుగా విఫలమవుతుందని, కాబట్టి పరిస్థితులను బట్టి సర్దకపోయే స్వభావాన్ని అలవర్చుకోవాలన్నారు. భర్త చేతిలో హింసకు గురయ్య ఇక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డప్పడు మహిళలు గృహహింస నిరోధక చట్టాన్ని రక్షణ కవచంలా ఉపయోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వున్న సఖి కేంద్రాన్ని సంప్రదించి మహిళ రక్షణ పొందవచ్చన్నారు. రక్షణ, ఆవాసం, వైద్య సహాయం, న్యాయ సహాయం తదితరాలు మహిళకు సఖి కేంద్రంలో అందుబాటులో వుంటాయన్నారు. కుటుంబ మనస్పర్థలు వచ్చినప్పుడు పోలీసు కేసులు లేదా కోర్టు కేసులకు వెళ్ళకముందు న్యాయ సేవాధికార సంస్థలో ప్రి - లిటిగేషన్ దాఖలు చేస్తే, ఇరుపక్షాల వారిని పిలిపించి సున్నితమైన బంధాలను దెబ్బతినకుండా రాజీ చేసే ప్రయత్నం చేస్తారని న్యాయమూర్తి వివరించారు. జిల్లా సంక్షేమ అధికారి సి.హెచ్ సంధ్యారాణి మాట్లాడుతూ గృహహింసకు గురవుతున్న మహిళ లేదా సంబంధీకులు ఎవరైనా 181 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే సఖి కేంద్రం ద్వారా తగిన రక్షణ కల్పిస్తామని తెలిపారు. గృహహింసకు సంబంధించిన కేసులలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసే బాధ్యత జిల్లా సంక్షేమాధికారిదేనని వివరించారు. కార్యక్రమంలో వక్తలు లింగ నిర్దారణ నిషేధ చట్టం, వివాహ తప్పనిసరి రిజిస్ట్రేషన్ చట్టం, వయో వృద్ధుల రక్షణ చట్టం తదితర మహిళా చట్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సఖి కేంద్ర నిర్వహకులు శ్రావణి, శ్రీదేవి, గిరిజ తదితరులు పాల్గొన్నారు.