Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందులు పడుతున్న సాంఘిక
సంక్షేమ వసతి గృహం బాలికలు
నవతెలంగాణ- బోనకల్
ప్రమాదకరంగా ఉన్న ప్రహరీ గోడను ఆగమేఘాల మీద అధికారులు కూల్చారు. కానీ నిర్మాణం మాత్రం మరిచారు. దీంతో వసతిగృహంలో గల బాలికలు భయం గుప్పెట్లో కాలం గడుపుతున్నారు. రాత్రి సమయంలో అయితే భయంతో నిద్ర పట్టడం లేదని బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని ఆళ్ళపాడు రోడ్డులోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం ప్రహరీ గోడ మూడు సంవత్సరాల నుండి ఓ పక్కకు ఒరిగి ప్రమాదకరంగా ఉండడంతో నాలుగు నెలల క్రితం ఆ ప్రహరీ గోడను విద్యార్థుల తల్లిదండ్రుల వ్యక్తం చేస్తున్న ఆందోళనతో అధికారులు కూల్చారు. ఆ స్థలంలో నూతన ప్రహరీ నిర్మాణం చేపట్టక పోవడంతో వసతి గృహంలోని 19 మంది విద్యార్థినులు, రాత్రి వాచ్ ఉమెన్ రాత్రి వేళల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ప్రహరీ గోడ లేకపోవడంతో విష కీటకాలు వసతి గహంలోకి ప్రవేశిస్తూ ఉండటంతో విద్యార్థునులు భయాందోళనకు గురౌతున్నారు. వసతి గృహంలో స్నానపు గదులు ప్రహరీ గోడ లేని వైపు ఉండడంతో ఆవైపు నుండి వెళ్లేందుకు బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రహరీ గోడ నిర్మాణ స్థలంలో తాత్కాలికంగా పట్టాను కట్టి అధికారులు చేతులు దులుపుకున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బాలికలకు పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు చేపట్టవలసి ఉన్నప్పటికీ అదేమీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రహరి గోడ నిర్మాణానికి పట్టుమని పది వేలు కూడా కాదు. అటువంటి దానిని నెలల తరబడి నిర్మాణం చేయకుండా అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఓ ప్రక్క తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చి పేద వర్గాల బాల, బాలికలు చదువుకొని ఉన్నతస్థాయికి వెళ్లే విధంగా సంక్షేమ వసతి గృహాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నా మరో వైపు వసతి గృహాల్లో పరిస్థితి దారుణంగా ఉన్నాయని విద్యార్థునులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మండల అధికారులు ప్రజా ప్రతినిధులు, సాంఘిక సంక్షేమ ఉన్నతాధికారులు దృష్టి సారించి స్థానిక సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని ప్రహరీ గోడ నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతున్నారు. వసతి గృహంలోని బాలికల ఇబ్బందుల దృష్ట్యా వెంటనే ప్రహరీ గోడ సమస్యను పరిష్కరించాలని మండల ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.