Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎన్ని నిర్భందాలు ఎదురైనా
సింగరేణిని పరిరక్షించుకుంటాం
అ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు
కూనంనేని
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రధాని మోడీ సహకారంతో బొగ్గు నిక్షేపాలను కొల్లగొట్టేందుకు వస్తున్న ఆదాని, అంబానీలను తెలంగాణాలో అడుగు పెట్టనివ్వబోమని, ఎన్ని నిర్భందాలు సృష్టించినా ఒక్క బొగ్గు పెల్లను కూడా పెకిలించకుండా అడ్డుకుని సింగరేణిని పరిరక్షించు కుంటామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పునరుద్ఘాటించారు. బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేపట్టారు. తొలుత యూనియన్ కొమరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఒక్కరోజు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కొల్లగొట్టి కార్పొరేట్ పెట్టుబడిదారులకు దారాదత్తంచేసే కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగించిందని, బొగ్గు పరిశ్రమలను ప్రైవేటుపరంచేసే నిర్ణయం తీసుకుంద న్నారు. కేంద్రం నిర్ణయంతో తెలంగాణాలోని నాలు గు బొగ్గుబ్లాకులు అంబానీ, అదానీల పరం కాను న్నాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేరపూరిత నిర్లక్ష్యం బొగ్గుబ్లాకుల ప్రైవేటీక రణకు ఆజ్యం పోసిందని, ప్రైవేటీకరణ బిల్లుకు నాడు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి ఇప్పడు వ్యతిరేక ఉద్యమాలంటూ కార్మికులను, ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు. దీనికి కేసీఆర్ పూర్తి భాద్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ, కేంద్ర కమిటి నాయకులు దమ్మాలపాటి శేషయ్య, కె.సారయ్య, వంగా వెంకట్, జి.వీరస్వామి, వై.రాంగోపాల్, బందెల నర్సయ్య, నాయకులు వి.మల్లిఖార్జున రావు, వై.శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. దీక్షలకు పలు కార్మిక సంఘాలు, రాజకీయపక్షాలు, సీపీఐ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సంఘీబావం తెలిపారు.