Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మెరుగైన విద్యను అందించేందుకు
మన ఊరు-మనబడి
అ జిల్లా పరిషత్ చైర్మెన్ కోరం కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు పెద్దపీట వేస్తుందని, గ్రామీణ ప్రజలకు మెరుగైన విద్యను అందించేందుకు మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని రూపొందించినట్లు, ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ చైర్మెన్ కోరం కనకయ్య అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ హాల్లో ప్రజా ప్రతినిధులు, వివిధ జిల్లా స్థాయి అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోరం కనకయ్య మాట్లాడారు. మన ఊరు, మనబస్తీ మనబడి కార్యక్రమాన్ని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పర్యవేక్షణ చేయాలని కోరారు. జిల్లాలోని పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు, మన పిల్లలకు ఉన్నత విద్యను అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ మహౌన్నత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. మండలాన్ని యూనిట్‌గా చేసి విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని 35 శాతం పాఠశాలలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు పెద్దపీట వేసి మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి అన్ని కులాల వారికి విద్యను అందిస్తున్నట్లు చెప్పారు.
జిల్లాలోని 792 ప్రాథమిక పాఠశాలలుండగా వాటిలో 246, 162 ప్రాథమికోన్నత పాఠశాలలుండగా 57, 67 ఉన్నత పాఠశాలలుండా 65 మొత్తం 368 పాఠశాలలను ఈ పథకం ద్వారా అభివృద్ధి చేయనున్నట్లు ఆయన వివరించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో 86, భద్రాచలంలో 55, కొత్తగూడెంలో 66, పినపాకలో 87, వైరాలో 17, ఇల్లందులో 57 పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసినట్లు చెప్పారు. రెండవ దశల్లో ప్రభుత్వం నిధులు విడుదల చేసి మొత్తం పాఠశాలల రూపురేఖలు మార్చనున్నట్లు ఆయన వివరించారు.
దశల వారిగా అన్ని పాఠశాలలను అభివృద్ధి : కలెక్టర్
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రభుత్వం ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటిని ఏర్పాటు చేసి జిల్లాలోని 1065 పాఠశాలకు గాను, 368 పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. మార్చి 31వ తేదీ వరకు పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని, తదుపరి రెండు సంవత్సరాల్లో దశల వారిగా అన్ని పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు సూచించిన 12 అంశాలతో పాటు అదనంగా క్రీడలు, గ్రంధాయలం ఏర్పాటుతో చేపట్టాల్సిన పనులపై అధికారులకు చెక్లీస్టు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ మెరుగు విద్యాలత, డిఆర్డిఓ మధుసూదనరాజు, డీఈఓ ఇ.సోమశేఖద్ శర్మ, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, మిషన్ బగీరథ, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్, టిఎస్ఎస్ఐడబ్ల్యుఐడిసి అధికారులు, జడ్పీటిసిలు, యంపిపిలు తదితరులు పాల్గొన్నారు.