Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యమంత్రి హామీ అమలకు
కూడా దిక్కు లేదా..?
- సర్వ రోగాల నివారణకు
'ఆశాలే' దిక్కు అన్నట్లుగా....
నవతెలంగాణ-బోనకల్
వైద్య ఆరోగ్య శాఖలో గ్రామీణ ప్రాంతాలలో ఆశా కార్యకర్తలదే ప్రముఖ పాత్ర. ఆశా కార్యకర్తలు లేకుండా ఏ పని కూడా జరిగే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలతో వెట్టిచాకిరీ చేయిస్తోంది. కానీ వారికి ఇచ్చే పారితోషకం మాత్రం అరకొరే. స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచుకోవడం లేదంటే ఆశా కార్యకర్తల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.
మండలంలో 22 గ్రామ పంచాయతీల్లో 42 మంది ఆశా కార్యకర్తలు విధులు నిర్వహిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నిర్వహించే పనులే కాక ప్రభుత్వం కూడా వీరి చేత అనేక రకాల పనులు చేయిస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నిత్యం ఆశా కార్యకర్తలు 24 వ్యాధులకు సంబంధించి ఇంటింటికి వెళ్లి మందులు పంపిణీ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో గర్భిణీ స్త్రీల పేరు నమోదు, గర్భిణీల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా వీరిదే. గవర్నమెంట్ ఆసుపత్రులలో ప్రసవం జరిగిన తర్వాత వారిని ఇంటికి తీసుకువెళ్ళవలసిన బాధ్యత కూడా ఆశ కార్యకర్తలదే. చిన్నారులకు సంవత్సరం వచ్చే వరకు టీకాలు వేయడం, గ్రామీణ ప్రాంతాలలో మరణాలు, జన్మదినాలు నమోదు, ఎయిడ్స్, షుగర్, లేప్రసీ తదితర వ్యాధులు గల రోగులకు మందులు ఇంటికి వెళ్లి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆశా కార్యకర్తలదే. తొమ్మిది రకాల టీకాలు వేయవలసిన బాధ్యత కూడా ఆశా కార్యకర్తలదే. 0 నుంచి 5 సంవత్సరాలలోపు కలిగిన చిన్నారులకు ఇంటింటికి వెళ్లి ఆశా కార్యకర్తలు టీకాలు వేస్తారు. ఇవి కాక ప్రభుత్వ పథకాలు అన్నింటిని ప్రజలకు అందించే బాధ్యత కూడా ఆశా కార్యకర్తలదే. వైద్య ఆరోగ్యానికి సంబంధించిన విధులే కాక వారికి సంబంధం లేని విధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయిస్తోంది. సర్వరోగ నివారణ మందుల లాగా ఆశా కార్యకర్తలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. రెండు దశల కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖలో వారి సేవలకు విలువ కట్టలేనివి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఆశా కార్యకర్తలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది అరకొర పారితోషకం మాత్రమే. ఈ ఇచ్చే అరకొర పారితోషకం కూడా అనేక నిబంధనలు విధించారు. ఈ నిబంధనలతో ఆశా కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తాము రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ అప్పగించిన ప్రతి పనిని పూర్తి చేస్తున్నామని, కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడామని ఆశా కార్యకర్తలు అంటున్నారు. తమకు రూ 7,200 పారితోషికం ఇచ్చారని ఆశా కార్యకర్తలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కాలంలో జూన్ 2021 నుంచి అదనంగా 2,250 రూపాయలు పెంచి 9,750 రూపాయలు ఇస్తామని ప్రకటించారని తెలిపారు. కానీ నేటి వరకు దానిని అమలు చేయడం లేదని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కూడా అమలు చేయకపోతే మేము ఎవరిని అడగాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ శ్రమను గుర్తించి కేసీఆర్ ప్రకటించిన విధంగా హామీని అమలు చేయాలని కోరుతున్నారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఆశా కార్యకర్తలకు పదివేల రూపాయలు ఇస్తున్నారని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలని ముక్త కంఠంతో కోరుతున్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి: ఆశా కార్యకర్తలు
తమకు ప్రధానంగా ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు తమను అనార్హులుగా ప్రకటించాలని కోరుతున్నారు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా యూనిఫామ్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం తమకు రికార్డులు ఇవ్వడం లేదని, ఆ రికార్డులను తామే తమ సొంత ఖర్చులతో కొనుగోలు చేస్తున్నాము. ప్రభుత్వమే రికార్డులను తమకు ఉచితంగా ఇవ్వాలన్నారు. కరోనా సమయంలో తాము చేసిన విధులకు అదనంగా వేతనము చెల్లించాలని కోరుతున్నారు. తాము కోరేది న్యాయమైన సమస్యల అయినప్పటికీ ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.