Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లబ్ది పొందనున్న 2527 విద్యార్ధులు
నవతెలంగాణ-అశ్వారావుపేట
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేయనున్న మన ఊరు-మన బడికి పథకానికి మండలంలోని పలు యాజమాన్యాల పరిధిలో 96 పాఠశాలలకు గాను జిల్లా, మండల పరిషత్ యాజమాన్యాలు పరిధిలోని వాటికి మొదటి దఫాగా 23 పాఠశాలలు ఎంపిక చేసారు. ఇందులో భాగంగా 2527 మంది విద్యార్ధిని విద్యార్ధులు లబ్ధి పొందుతున్నారు. ఇందులో 15 ప్రాధమిక, 05 ప్రాధమికోన్నత, 03 ఉన్నత పాఠశాలలను ఎంచుకున్నారు. ఈ పథకం అమలు విజయవంతానికి ఆయా పాఠశాలల పరిధిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి విరాళాలు సేకరించడానికి ఆయా పాఠశాలలు ప్రధానోపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు విస్త్రుత ప్రచారం చేపడుతున్నారు. ఇందుకు గాను ఆయా పాఠశాలల్లో విద్యనభ్యసించి ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా, ఉన్నతాధికారులు వివిధ రంగాల్లో ఆర్ధికంగా స్థిరపడిన వారిని ఈ సమావేశాలకు ఆహ్వానిస్తున్నారు. అశ్వారావుపేట ఉన్నత పాఠశాలలో చదివి ప్రస్తుతం ఎందరో ఉన్నత స్థానాల్లో ఉన్న వారిలో స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎంపిపి శ్రీరామమూర్తి, మాజీ సర్పంచ్లు చీమకుర్తి వెంకటేశ్వరరావు, కొక్కెరపాటి పుల్లయ్య, పలువురు ప్రముఖ విలేకరులు ఉన్నారు. దీంతో వీరందరిని స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పత్తేపరపు రాంబాబు ఆహ్వానించి పాఠశాల అభివృద్ధికి సహాకరించే విధంగా శుక్రవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు.