Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
ఈ నెల 27వ తేదీ ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో 0-5 సంవత్సరాల ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశపు హాలు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణపై లైన్ డిపార్టుమెంట్లుతో జిల్లాస్థాయి టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో చుక్కలు వేయించడంలో నిర్లక్ష్యం వహిస్తే పోలియో వచ్చే అవకాశం ఉందని, మహామ్మారి నుండి చిన్నారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. మారుమూల గ్రామాలు, గుత్తికోయలకు పోలియో చుక్కలపై అవగాహన ఉండదని, అటువంటి గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో 23,945, గ్రామీణ ప్రాంతాల్లో 73,577 మంది మొత్తం 97,522 మంది చిన్నారులున్నట్లు జాబితా తయారు చేసినట్లు చెప్పారు. అర్బన్ ప్రాంతాల్లో 194, గ్రామీణ ప్రాంతాల్లో 731 మొత్తం 925 టీములు పోలియో చుక్కలు వేయు కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు చెప్పారు. 33 మొబైల్, 33 ట్రాన్సిట్ టీములు పాల్గొంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ, విద్యా, మహిళా స్వయం సహాయక సంఘాలు, మెప్మా సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. మార్చి 7 నుండి 16 సంవత్సరాలు వయస్సు కలిగినవారికి టీకాలు వేసేందుకు చేపట్టనున్నమిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాలనికి ప్రణాళికలు తయారు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. మార్చి, ఏప్రిల్, మే మాసాలలో టీకా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నదని చెప్పారు. ఈ జిల్లా టాస్క్ ఫోర్సు కమిటి సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ జెవిఎల్. శిరీష, ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాగేంద్రప్రసాద్, జడ్పీ సిఈఓ మెరుగు విద్యాలత, డిపిఓ రమాకాంత్, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, అన్ని మండలాల యంపిడిఓలు, యంపిఓలు తదితరులు పాల్గొన్నారు.