Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణకు పంచాయతీ రాజ్ వ్యవస్థను విస్తరించింది. పినపాక నియోజకవర్గంలో సుమారుగా 125 పైగా పంచాయతీలు ఉన్నవి. ఈ పంచాయతీలలో సరైనా బడ్జెట్ లేక పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 మంది పంచాయతీ కార్యదర్శులు వివిధ రూపాలలో తమ ప్రాణాలు వదులుకున్నారు. ఇటీవల కాలంలో మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి చెందిన వికలాంగుడైనా పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ అప్పుల బాధకు తట్టుకోలేక ఆత్మహాత్యకు పాల్పడ్డారు. దీనికి ప్రధానంగా ఒత్తిడి కారణం. ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టరు, ఒక ట్రాలీ, వాటర్ ట్యాంకర్‌ను ప్రభుత్వం కేటాయించింది. ట్రాక్టరుకు జీపిఎస్ సిస్టం ఉండడం కారణంగా ఉదయం 8 గంటలకల్లా గ్రామాల్లోకి చెత్తను సేకరించడానికి వెళ్లాలి. అలా వెళ్లకుండా ట్రాక్టరు కార్యాలయంలో ఉంటే జీపిఎస్ సిస్టంద్వారా జిల్లా పంచాయతీ అధికారులకు తెలిసిపోతుంది. ఒకవేళ ట్రాక్టరు వెళ్లనిచో వెంటనే సంజాయిషి ఇవ్వాలి. దొంగలపై నిఘా పెట్టినట్లు పంచాచతీ కార్యదర్శి ఫోన్లకు కూడా జీపిఎస్ సిస్టం అనుసంధానం చేయడంతో వారు కూడా ఉదయం 8 గంటల నుండి పనిలో ఉన్నట్లుగా అధికారులకు తెలిసిపోతుంది. ఎక్కడెక్కడా ఏ పనులు చేయించేది కూడా జీపిఎస్ ద్వారా తెలుస్తుంది. కానీ ట్రాక్టరు మెయింట్‌నెన్స్ డీజిల్, కూలీల డబ్బులు, వీధి దీపాలు, బ్లీచింగ్ అప్పులు చేసి చెల్లించాల్సి వస్తుంది. ఒక ట్రాక్టరును మెయింటెన్ చేయాలంటే నెలకు రూ.10 వేల నుండి 12 వేల దాకా ఖర్చు అవుతుంది. పంచాయతీలకు నాలుగు నెలల నుండి బిల్లులు రాక జీతాల నుండి, తమ డబ్బులను ఖర్చు చేస్తూ లక్షల్లో అప్పులు చేసిన వారున్నారు. బిల్లులు రాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఒత్తిడికి గురవడం వలన బిపి, షుగర్, వయస్సు పైబడిన వారు గుండెనొప్పితో మరణిస్తున్నారు. గ్రామాల్లోకి చెత్తట్రాక్టరు, డ్రైవర్‌కు గంట ఆలస్యమైనా నిఘా వ్యవస్థ ద్వారా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది కాకుండా వారంలో మూడు సార్లు జాతీయ స్థాయిలో, రాష్ట్రీయ స్థాయిలో మండల స్థాయి అధికారులు పరచాయతీని పరిశీలించేందుకు వస్తూ ఉంటారు. వీరికి అయ్యే ఖర్చులు కూడా కార్యదర్శులే భరించాల్సి ఉంటుంది. దీనికి తోడు ఉపాధి హామీ పనులు కూడా కార్యదర్శులకు కేటాయించడం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్, మేట్లు పని కూడా కార్యదర్శి చేయాల్సి ఉంటుంది. రోజుకు 30 మందికి పైగా కార్మికులు ఉపాధి హామీ పనులకు రాకుండా ఉంటే కార్యదర్శులదే బాధ్యత. వారు వచ్చే విధంగా కార్యదర్శులే చూడాలి. లేబర్ టార్గెట్ కూడా తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. ట్రాక్టరు డిజిల్ మెయింటెనెన్స్‌తో పాటు వివిధ సీజన్లలో కూలీలకు చెల్లించడానికి డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వడ్టీలకు తెచ్చిన డబ్బులకు వడ్డీ కట్టలేక, బిల్లులు రాక తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇది కాకుండా మొక్కలకు నీరు పోసేందుకు, చెత్త వేసేందుకు ఒకే ట్రాక్టరు ఉండడం వలన అది సరిపోక అదనంగా మరో ట్రాక్టరును అద్దెకు తీసుకోవాల్సి వస్తుంది. దీని ఖర్చుకు కూడా అప్పు తేవాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాలంలో మొక్కలు నాటించకుండా ఇష్టం వచ్చిన సీజన్లో మొక్కలు నాటాలని ఆదేశాలు జారీ చేస్తుంటారు. పంచాయతీ పరిధిలో 85 శాతం మొక్కలు నాటకుండా ఉంటే కార్యదర్శులను సస్పెండ్ చేస్తున్నారు.