Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మెన్ మహేశ్
- తహసీల్దారును కలిసిన పురపాలకవర్గం
నవతెలంగాణ- సత్తుపల్లి
డబుల్ బెడ్రూం ఇండ్ల అర్హుల జాబితా అస్తవ్యస్తంగా ఉన్న నేపధ్యంలో మళ్లీ కొత్తగా దరఖాస్తులను స్వీకరించాలని సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్ తహసీల్దారు కేవీఎంఏ మీనన్‌ను కోరారు. శుక్రవారం ఛైర్మెన్ మహేశ్ పాలకవర్గ సభ్యులతో కలిసి తహసీల్దారును ఆయన కార్యాలయంలో కలిశారు. ప్రకటించిన జాబితాలో ఆయా వార్డులకు చెందిన అర్హులు వేరే వార్డుల్లో ఉండటంతో పాటు పట్టణంతో సంబంధంలేని, వేరే ఊర్లకు చెందిన వారి పేర్లు కూడా జాబితాలో చేరాయన్నారు. ఈ నేపధ్యంలో పట్టణంలో ఉంటూ ఇండ్లు, వాకిళ్లు లేని అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని తహసీల్దారుకు వివరించారు. ఈ నేపధ్యంలో వార్డు కౌన్సిలర్లే అసలైన లబ్ధిదారుల నుంచే దరఖాస్తులు అందించడం జరుగుతుందని, అందిన దరఖాస్తులను బట్టి వార్డు కౌన్సిలర్‌కు ఎలాంటి ప్రమేయం లేకుండా తహసీల్దారు కార్యాలయ సిబ్బందితోనే విచారణ జరిపించి అర్హులను గుర్తించాలని మహేశ్ కోరారు. దీంతో పాటు అనర్హుల నుంచి దరఖాస్తులు అందితే ఈది మీ పరిధిలోనే తొలగించాలని, ఈ విషయంలో తమ పాలకవర్గం ఫైరవీలు చేయరని మహేశ్ స్పష్టం చేశారు. ఇందుకు స్పందించిన తహసీల్దారు మీనన్ కొత్తగా ఇచ్చే దరఖాస్తులను ఈనెల 28లోగా తీసుకుంటామని, ఆ తదుపరి వచ్చిన దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోబోమని తహసీల్దారు మీనన్ స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, 2 ఫొటోలు, అద్దెకుంటున్న ఇంటి యజమాని ఇంటిపన్ను/ విద్యుత్ బిల్లు ప్రతి, వికలాంగులు/ ఎక్స్ సర్వీస్మెన్లు ఉంటే వాటి పత్రాలు దరఖాస్తుకు జతచేయాల్సి ఉంటుందన్నారు. 134 డబుల్ బెడ్రూం ఇండ్లకు గాను వార్డుల వారీగా వచ్చిన దరఖాస్తుల సంఖ్యను బట్టి రేషియో పద్ధతిలో వార్డులకు డబుల్ ఇండ్లను కేటాయించడం జరుగుతుందని తహసీల్దారు మీనన్ తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో కౌన్సిలర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, వైస్ ఛైర్మెన్ తోట సుజలారాణి, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, గ్రాండ్ మౌలాలి, ఎస్కే చాంద్‌పాషా, దూదిపాల రాంబాబు, గుంట్రు రాఘవేంద్ర, మారుతి సూరిబాబు, అమరవరపు విజయనిర్మల, వీరపనేని రాధికాబాబీ, కంటె నాగలక్ష్మీ పాల్గొన్నారు.