Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ- నేలకొండపల్లి
ప్రజానాట్యమండలి సీనియర్ కళాకారులు అమరజీవి మారుతి రంగయ్య స్ఫూర్తితో ప్రజా కళలను కాపాడుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్రావు పిలుపునిచ్చారు. గురువారం రాత్రి మండలంలోని గువ్వలగూడెం గ్రామంలో మారుతి రంగయ్య 21 వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ రంగయ్య ప్రజా నాట్య ఆధ్వర్యంలో అనేక కళారూపాలను ప్రదర్శించి ప్రజలను చైతన్యవంతం చేశారన్నారు. ఆయన ప్రజా కళల పట్ల, సిపిఎం పార్టీ పట్ల అత్యంత విశ్వాసం, అంకితభావంతో పార్టీ అభివృద్ధికి, ప్రజలను చైతన్యవంతం చేసేందుకు అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. రంగయ్య ఖమ్మం జిల్లాతో పాటు నల్లగొండ, వరంగల్, కష్ణాజిల్లాలో కోలాట బృందాలను, డప్పు దళాలను ఏర్పాటు చేసి వీధి నాటకం రూపాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చి ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజల రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై చైతన్యవంతం చేశారన్నారు. తొలుత ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కళారూపాలు, రైతు వీధి నాటిక ప్రజలను ఆలోచింపజేశాయి.కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కేవీ రామిరెడ్డి, పగిడికత్తుల నాగేశ్వరరావు, మారుతి కొండలరావు, సీనియర్ నాయకులు నూతలపాటి అప్పారావు, ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే శాంతారావు, రాష్ట్ర నాయకులు అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్, జిల్లా కార్యదర్శి వేముల సదానంద్, సుబ్రమణ్యకుమార్, పార్టీ శాఖ కార్యదర్శి మారుతి సూర్యనారాయణ, ఐద్వా ముదిగొండ మండల కార్యదర్శి పయ్యావుల ప్రభావతి, ఎస్కే రఫీ, ఎస్కే కరీం, జానీ పాల్గొన్నారు.