Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - బోనకల్
రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఉక్రెయిన్ దేశంలో చదువుకునేందుకు వెళ్ళిన విద్యార్థుల కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. మధిర మండలం ఖాజీపురం గ్రామానికి చెందిన మహమ్మద్ నాసీర్ హుస్సేన్ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదివేందుకు 2021 డిసెంబర్ 9న ఉక్రెయిన్ కు హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి వెళ్ళాడు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి మూడు వందల కిలోమీటర్ల సమీపంలో విన్నిట్సీయా పట్టణంలో ఉన్న వినిస్టా మెడికల్ యూనివర్సిటీలో చేరారు. నాసీర్ హుస్సేన్ తల్లిదండ్రులు మహమ్మద్ గౌస్, ఖాజా బస్రీ. గౌస్ మధిరలో టింబర్ డిపో నిర్వహిస్తున్నాడు. వారి పెద్ద కుమారుడు అయిన నాసిర్ హుస్సేన్ వైద్య విద్య అభ్యసించేందుకు ఉక్రెయిన్ దేశానికి వెళ్ళాడు. యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇండియాలోని గౌస్ కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. ఎప్పటికప్పుడు కుమారుడికి ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. నాసిర్ హుస్సేన్ తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం..... యుద్ధం కారణంగా ఇప్పటికే తాను నివసిస్తున్న ప్రాతంలో రెండు సైరన్లు మొహరించారని, మూడో సారి సైరన్ మోగితే మాత్రం బంకర్లలోకి వెళ్లాలని యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు సూచించినట్లు తెలిపాడు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపద్యంలో స్వదేశానికి తిరిగి వచ్చేందుకు నాలుగు రోజుల క్రితం 78 వేల రూపాయలు చెల్లించి విమాన టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే రెండు రోజులు ముందుగానే యుద్ధం రావడంతో విమానాశ్రయాలను మూసివేశారు. దీంతో ఆయన స్వదేశానికి రాలేకపోయాడు. ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదని, కానీ పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన ఏర్పాటు చేసి స్వదేశానికి వచ్చేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశాడు.