Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ
నవతెలంగాణ- ముదిగొండ
అధికారులు ఎంత ఉన్నతమైన చదువులు చదివిన ప్రజాప్రతినిధులను చులకనభావంతో చూస్తే సహించబోమని ఎంపీపీ సామినేని హరిప్రసాద్ అధికారులపై మండిపడ్డారు. మండల పరిషత్తు కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు విధినిర్వహణలో అలసత్వం వహించటం తగదన్నారు. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధుల నుండి ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కారానికి కృషి చేయాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వలన పారిశ్రామిక ప్రాంతంలో ఎత్తు తక్కువ ఉన్న ట్రాన్స్ఫారం షాక్ కొట్టి ఓ వ్యక్తి ప్రమాదానికి గురై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని మండల కోఆప్షన్ సభ్యులు సొందుమియా సమావేశంలో వాపోయారు. ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫారంను మార్చాలని ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంపై ఎంపిపి సామినేని హరిప్రసాద్, విద్యుత్ శాఖ ఏఈ రామారావుతో మాట్లాడి వెంటనే ట్రాన్స్‌ఫారంను మార్చాలని సూచించారు. వల్లభి పీహెచ్సీ వైద్యాధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ధర్మేందర్ ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వలేదని విషయంపై ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ, మండల స్థాయి ప్రజాప్రతినిధులను అధికారులు అగౌరవపరిచే విధంగా వ్యవహరిస్తే ఊరుకోమన్నారు. సమావేశానికి సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు అధికారులు గైర్హాజరయ్యారు. సమావేశంలో వివిధ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం అంగన్వాడి టీచర్స్‌కు ఎంపీపీ సెల్ఫోన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ మంకెన దామోదర్, ఎంపీడీవో డి.శ్రీనివాసరావు, తాసిల్దార్ తూమాటి శ్రీనివాస్, సిడిపిఓ సరస్వతి, నీటిపారుదల శాఖ డిఈ రాణి, ఎంపీవో పి సూర్యనారాయణ, ఏవో మందుల రాధ, ఏపీఎం గంగుల చిన్న వెంకటేశ్వర్లు, ఏఈలు విజయరాజు, వెంకటకృష్ణ, సర్పంచులు కోటి అనంతరాములు,అమరయ్య, కొట్టే అరుణ,సామినేని రమేష్,వాకదాని కన్నయ్య,కొండమీద సువార్త,ఎంపీటీసీ సభ్యులు దేవరపల్లి ఆదినారాయణరెడ్డి,పెద్దపొంగు రాంబాబు,బిచ్చాల బిక్షం తదితరులు పాల్గొన్నారు.