Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపయోగపడే పనులను చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ మున్సిపల్ కమిషనర్లుకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మున్సిపల్ ఛైర్మన్, మున్సిపల్ కమిషనర్లు, సిబ్బంది, ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు నిర్వహణ, ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఆక్రమణలు వల్ల పాదచారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. సమీకృత మార్కెట్ నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతున్నదని, కాంట్రాక్టరుకు చివరి నోటీసు జారీ చేయాలని, అప్పటికీ వేగం పెంచకపోతే బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పనులు చేయకుండా స్టోరీలు చెప్తున్నారని కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర మున్సిపాల్టీలలో పనులు జరుగుతుంటే ఇక్కడ మాత్రం ఎందుకు జాప్యం జరుగుతున్నదని హెచ్చరించారు. మున్సిపాల్టీలలో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేపట్టాలని, రానున్న హరితహారంలో బయట నుండి మొక్కలు తేవడానికి అవకాశం ఉండదని చెప్పారు. నర్సరీల్లో ఎన్ని రకాల మొక్కలు పెంచుతున్నారో నివేదిక ఇవ్వాలని చెప్పారు. మొక్కల సంరక్షణకు సర్సరీల్లో షేడ్ నెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నాలుగు. మున్సిపాల్టీలలో 104 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా 50 మాత్రమే ఏర్పాటు చేశారని మిగిలినవి. కూడా ఏర్పాటు చేయు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పాల్వంచలో గ్రంథాలయం ఏర్పాటు చర్యలను ముమ్మరం చేయాలని చెప్పారు. మున్సిపాల్టీ బడ్జెట్ ఆదాయ వ్యయాలను అంచనా వేస్తూ బాగా తయారు చేశారని అభినందించారు. మున్సిపాల్టీలు ఆదాయ సమకూర్చుకునే మార్గాలను అన్వేషణ చేయాలని సూచించారు. ఇంటి వసూళ్లు ప్రక్రియ మార్చి 15 వరకు పూర్తి చేయాలని, బిల్ కలెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని చెప్పారు. మార్చి 15 తదుపరి లక్ష్యం సాధించని బిల్ కలెక్టర్లుపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రతి పాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. కొత్తగూడెంలో 75 పాల్వంచలో 90, ఇల్లందులో 95, మణుగూరులో 63 శాతం మేర మాత్రమే ఇంటింటి నుండి వ్యర్థాల సేకరణ జరుగుతున్నదని, నూరు శాతం సేకరణ చేయు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 90 శాతం తడి, పొడి చెత్త సేకరణ జరుగుతున్న వార్డుల్లో డస్ట్‌బిన్స్ పంపిణీ చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కమిషనరు ఆదేశించారు. ఈ సమావేశంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ కమిషనర్లు, ప్రజారోగ్య శాఖ ఈఈ రంజిత్, డీఈలు, టిపిఓలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.