Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే హరిప్రియపై తీవ్ర విమర్శలు చేసిన పీఏసీఎస్ చైర్మెన్
- విభేదాలు సహజం : రేగా
- విభేదాలకు ఇది వేదిక కాదు : మధు
నవతెలంగాణ-ఇల్లందు
ఎప్పటినుండో రగులుతున్న అసంతృప్తి సెగలు బుధవారం ఇల్లందులో జరిగిన టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్ధాయి సమావేశంలో బయట పడ్డాయి.
పాత బస్టాండ్ సెంటర్లోని ఐతా కాంప్లెక్‌లో బుధవారం ఎమ్మెల్యే హరిప్రియ అధ్యక్షతన టీఆర్ఎస్ ఇల్లందు నియోజకవర్గ స్థాయి జనరల్‌బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యమ్రానికి పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధు సమక్షంలోనే విబేధాలు భగ్గుమన్నాయి. కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే బయ్యారం మండల పీఏసీఎస్ చైర్మెన్ మూల మధుకర్ రెడ్డి వేదికపై తీవ్ర విమర్శలు చేస్తూ అసహనం వ్యక్తం చేశారు.
మండలంలో కొంతమంది వర్గ విభేదాలకు పాల్పడుతున్నారని అన్నారు. కనీసం ఈ సమావేశానికి కూడా సమాచారం ఇవ్వలేదని అన్నారు. సొంత పార్టీ నాయకులు పార్టీ సర్పంచ్‌పై సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు మద్దతుగా పలువురు నాయకులు మద్దతుగా సమావేశంలో నిరసన వ్యక్తం చేయడంతో కొంత సేపు కలకలం మొదలైంది. ఊహించని విమర్శలకు అంతా ఉలిక్కిపడ్డారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే హరిప్రియ తన ప్రసంగంలో మాట్లాడుతూ జిల్లాకి జిల్లా అధ్యక్షులు, మండలానికి సంబంధించి పార్టీ కార్యక్రమాలకు మండల అధ్యక్షులు సమాచారం తెలియజేస్తారని దీనినే ప్రజా ప్రతినిధులు నాయకులు గమనించాలని ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు. భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ విమర్శలను తేలికగా కొట్టిపారేశారు. ఎవరికీ సందేహం వద్దని మూడవ సారి కూడా తెరాస పార్టీ అధికారంలోకి రానుందని తెలిపారు. ఖమ్మం జిల్లా తెరాస అధ్యక్షుడు తాతా మధు మాట్లాడుతూ విభేదాలకు ఇది వేదిక కాదని అన్నారు. విభేదాలకు పోకుండా అందరినీ కలుపుకుని పోవాలన్నారు.