Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాల పెండింగ్ దరఖాస్తులపై సత్వర పరిష్కార చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఆదేశించారు. కలెక్టరేట్ లో బుధవారం సాయంత్రం కళాశాల ప్రిన్సిపాల్స్, సంక్షేమ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాల పెండింగ్ దరఖాస్తులపై కళాశాలల వారీగా సమీక్షించారు. 20 కళాశాలల్లో సుమారు 20 వేలకు పైగా పోస్టు మెట్రిక్ ఉపకారవేతనాల దరఖాస్తులు వివిధ దశలలో పెండింగ్లో ఉన్నాయన్నారు. కళాశాలల్లో పెండింగ్లో ఉన్న 15 వేల హార్ట్ కాపీలను సత్వరమే సంబంధిత శాఖాధికారులకు సమర్పించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బి.సి. సంక్షేమ శాఖల అధికారులు సంబంధిత కళాశాలల బాధ్యులతో సమీక్షించి హార్ట్ కాపీలు, ఆధార్ అథంటికేషన్ పెండింగ్ దరఖాస్తుల పట్ల సత్వర పరిష్కార చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యా ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో పెండింగ్ ఉపకారవేతనాలపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బి.సి సంక్షేమ శాఖాధికారులు కె.సత్యనారాయణ, కృష్ణనాయక్, జ్యోతి, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.