Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెల 5,6 తేదీల్లో సంఘం
రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు
- కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ
నవతెలంగాణ- ఖమ్మం
ఫూలే, అంబేద్కర్ల స్ఫూర్తితో మార్చి, ఏప్రిల్ నెలలలో దళిత సమస్యల పరిష్కారంకై సామాజిక అధ్యయన యాత్రలు, సమరశీల పోరాటాలను రూపకల్పన చేయుట కోసం ఈ నెల 5,6 తేదీల్లో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న కెవిపిఎస్ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశాలను జయప్రదం చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జె.జాన్వెస్లీ పిలుపు నిచ్చారు. బుధవారం స్థానిక ఎన్నెస్పీ క్యాంపులోని సంఘం జిల్లా కార్యాలయంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము శ్రీను అధ్యక్షత కెవిపిఎస్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు రాజ్యాంగం ప్రకారం న్యాయంగా రావాల్సిన నిధులను కేటాయింపులు చేయడంలోనే వివక్షత చూపుతున్నాయని, కేటాయించిన నిధులను ఇతర రంగాలకు దారిమళ్లిస్తు దళితులకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో దళిత గిరిజనులపై దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. తెలంగాణ ధనిక రాష్ట్రంలో కూడా దళితులకు చేసిందేమి లేదన్నారు. దళితులు ఏమాత్రం కోరకుండానే ప్రకటించిన దళిత బంధు పథకం అమలుకై చిత్తశుద్ధితో నియోజక వర్గానికి 2000 యూనిట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కంటితుడుపు చర్యగా నియోజకవర్గానికి 100 యూనిట్లు ఇచ్చి చేతులు దులుపుకోవాలనే కేసీఆర్ ప్రయత్నాలను విరమించుకొనిి, దళితులకు న్యాయం చేయాల న్నారు. దళిత బంధును ఎమ్మెల్యేలకు అప్పగించకుండా జిల్లా కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీకు అప్పగించాలని కోరారు. ఎమ్మెల్యేలకు దళిత బంధును అప్పచెప్పడం వల్ల ఏకపక్ష నిర్ణయాల వల్ల నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగడానికి అవకాశం ఉంటుందన్నారు. దళిత బంధు రాజకీయ జోక్యం లేకుండా గ్రామసభల ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్ మాట్లాడుతూ ఇప్పటికే వేల సంఖ్యలో ఎస్సి కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు వెంటనే రుణాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా దళితులకు అరకొర నిధులు కేటాయిస్తూ దళితులను మరింత మోసగిస్తున్నారని విమర్శించారు. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధును రాజకీయాలకు అతీతంగా ఇవ్వాలన్నారు. మంత్రులు ఎమ్మెల్యేల జోక్యం లేకుండా అధికారుల ద్వారా పారదర్శకంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు బొట్ల సాగర్, కుక్కల సైదులు, నవీన్, వెంకన్న, సైదులు, పి.సత్యనారాయణ, వినరు తదితరులు పాల్గొన్నారు.