Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
బోనకల్ మండల కేంద్రంలో ఆర్ఓబి బ్రిడ్జి కింద గల అక్రమ కట్టడాలు, బడ్డీ కొట్లను తొలగించవద్దని మండలంలోని అన్ని రాజకీయ పక్షాల నాయకులు బుధవారం మండల అధికారులను తాసిల్దార్ కార్యాలయంలో కలిసి కోరారు. ఈ నెల 19వ తేదీన జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ మధిరలో జరుగు మధిర మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు బోనకల్ మీదుగా వెళ్లారు. ఆ సమయంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండటం, ఆర్వోబీ బ్రిడ్జి కింద బడ్డీ కొట్లు ఉండటాన్ని గమనించారు. తిరిగి ఖమ్మం వెళ్లేటప్పుడు బడ్డీ కొట్ల వద్ద తన వాహనాన్ని ఆపి తాసిల్దార్ రావూరి రాధిక, ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవిలను పిలిపించి శనివారం నాటికి (ఫిబ్రవరి 26వ తేదీ కల్లా) ఆర్ఓబి బ్రిడ్జి కింద గల బడ్డీ కొట్లను, యన్ఎస్పీ కాలవపై ఉన్న షాపులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. దీంతో మండల అధికారులు కలెక్టర్ ఆదేశాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మండలంలోనే అన్ని రాజకీయ పక్షాలకు చెందిన మండల నాయకులు తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ రావూరి రాధిక, ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవి, ఎస్ఐ తేజావత్ కవిత, ఆర్అండ్బి ఏఈ ప్రదీప్ రెడ్డి లను కలిశారు. వ్యాపారం చేసుకుంటున్న వారందరూ చిరు వ్యాపారులేనని వారిని అక్కడ నుంచి తొలగించ వద్దని అధికారులను కోరారు. పదిహేను రోజులపాటు తమకు సమయం ఇవ్వాలని ఈ లోపు కలెక్టర్ విపి గౌతమ్‌ను కలిసి సమస్యను వివరిస్తామని, అప్పటివరకు బడ్డీ కొట్లను తొలగించవద్దని కోరారు. దీంతో మండల అధికారులు గత నెల ఫిబ్రవరి 26 నాటికే కలెక్టర్ ఆదేశాల ప్రకారం బడ్డీ కొట్లను తొలగించాలని, కానీ పని ఒత్తిడి వలన ఇప్పటికే ఆలస్యం అయిందని కలెక్టర్ ఆదేశాలు అమలు చేయటం తప్ప తమ చేతిలో ఏమీ లేదని రాజకీయ నాయకులకు మండల అధికారులు స్పష్టం చేశారు. కలెక్టర్ ఆదేశాలను అమలు చేస్తున్న సమయంలో అన్ని రాజకీయ పక్షాలు తమకు సహకరించాలని మండల అధికారులు అన్ని రాజకీయ పక్షాల నాయకులను కోరారు. మండల అధికారులను కలిసిన వారిలో బోనకల్ సర్పంచ్ బుక్యా సైదా నాయక్, సిపిఎం నాయకులు గుగులోతు పంతు, తెల్లాకుల శ్రీనివాసరావు, బోయినపల్లి వీరబాబు, భూక్య జాలు, ఏసుపోగు బాబు, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్, మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు, టిడిపి మండల అధ్యక్షుడు రావుట్ల సత్యనారాయణ, మండల పరిషత్తు ఉపాధ్యక్షుడు గుగులోతు రమేష్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, వైఎస్సార్ టిపి నాయకులు ఇరుగు జానేసు ఉన్నారు. అధికారుల వెంట గిరిదావర్ గుగులోతు లక్ష్మణ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి దామల్ల కిరణ్ ఉన్నారు.