Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-బోనకల్
బోనకల్ బ్రాంచ్ కెనాల్‌కు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సాగర్ నీటిని విడుదల చేయడంతో బోనకల్లు మండలానికి సాగర్ నీరు బుధవారం చేరు కున్నాయి. వారబందీ ప్రకారం సాగర్ నీటిని విడుదల చేస్తున్న అధికారులు పది రోజుల తర్వాత బోనకల్ బ్రాంచ్ కెనాల్ సాగర్ నీటిని విడుదల చేశారు. బోనకల్ నీటిపారుదల సబ్ డివిజన్ పరిధిలోని బోనకల్ మండలంలో 12,738 ఎకరాలలో అన్నదాతలు మొక్క జొన్న పంటను సాగు చేశారు. సాగర్ నీరు అందక అనేక గ్రామాలలో మొక్కజొన్న పంట ఎండి పోతూ వస్తుంది. ఈ క్రమంలో అన్నదాతలు మండల కేంద్రంలో గల నీటిపారుదల సబ్ డివిజన్ కార్యాలయం ముందు ఇటీవల ఆందోళనలు నిర్వహించారు. వారబందీని ఎత్తివేసి నిర్విరామంగా సాగర్ నీటిని విడుదల చేస్తే తప్ప మొక్కజొన్న పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు నీటిపారుదల శాఖ అధికారులను కోరారు. రైతులు ఆందోళన చేసిన కొన్ని రోజులకే వారబందీ పేరుతో సాగర్ నీటిని నీటి పారుదల శాఖ అధికారులు నిలిపివేశారు. పది రోజుల అనంతరం బోనకల్ బ్రాంచ్ కెనాల్‌కు సాగర్ నీటిని విడుదల చేశారు. సాగర్ నీరు బోనకల్లు మండలానికి మాత్రం చేరుకున్నాయి. సాగర్ నీరు బోనకల్ మండలంలో ఎండిపోతున్న మొక్కజొన్న పంటకు జీవం పోస్తాయో లేదోనని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.