Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశ్రాంత ఉద్యోగులకు కీలక పదవులు
- తెలంగాణ క్యాడర్ ఐఏఎస్‌ల పట్ల చిన్న చూపు
- ప్రజా సంపదను పంచుకుంటున్న పాలకులు
- అవినీతి పాలన అంతానికే పీపుల్స్ మార్చ్
- పాదయాత్రలో సర్కారును తూర్పారబట్టిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణ- ముదిగొండ
ఆత్మగౌరవం దక్కాలని...కొలువులు కావాలని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర కేడర్ ఐఏఎస్‌లకు పెద్ద పీట వేయడమేంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ఏసీబీ డీజీ అంజనీకుమార్‌లు మొదలుకొని అనేక కీలక శాఖలను ఆంధ్ర కేడర్ ఐఏఎస్ అధికారులకు అప్పగించి తెలంగాణ క్యాడర్ ఐఏఎస్‌లను చిన్న చూపు చూడడంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సర్కార్‌ను నిలదీస్తానని వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారానికై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర బుధవారం నాలుగో రోజుకు చేరుకుంది. ముదిగొండ మండలం ఖానాపురం, పండ్రేగుపల్లి, కోదండరాంపురం, ముత్తారం, వివి కిష్టపురం, గ్రామాల్లో భట్టి విక్రమార్క పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పాలకులు ప్రజాసంపదను దోపిడీ చేయడానికై తెలంగాణ అధికారులను పక్కనపెట్టి ఆంధ్ర అధికారులకు పెత్తనం ఇవ్వడంతోపాటు, విశ్రాంతి ఉద్యోగుల అయిన తమ బంధువులను తీసుకొచ్చి కీలక పదవులు ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సాధించిన 8 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దాదాపు 15 లక్షల కోట్ల వరకు ఉందని, ఈ సంపద ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అవినీతి పాలన అంతం చేయడానికే పీపుల్స్ మాత్రం మొదలు పెట్టానని భట్టి విక్రమార్క ప్రకటించారు.
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని ఆ సంఘం నాయకులు ఊరుకొండ రాజు ఆధ్వర్యంలో మల్లు భట్టి విక్రమార్క వినతిపత్రం అందజేశారు. తొలిత ఆయా గ్రామాల్లో వైయస్సార్, ఎన్టీఆర్, గాంధీ విగ్రహాలకు భట్టి పూలతో నివాళులర్పించారు. 15 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర కొనసాగింది. రాత్రి మల్లన్నపాలెం చేరుకొని భట్టి బస చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి.దుర్గాప్రసాద్, జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు, అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు మల్లు నందిని, మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు దోబ్బల సౌజన్య, మండల అధ్యక్షులు గుడిపూడి ఝాన్సీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు, నాయకులు బుల్లెట్ బాబు, పసుపులేటి దేవేంద్ర, వల్లూరి భద్రారెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అజ్గర్, మల్లెల అజరు, చెరుకుపల్లి రాంబాబు, పలపాటి కృష్ణ, బండారుపల్లి వీరబాబు, చిన్నపంగు శివ, వడ్డేమాధవరావు, వీరబాబు, వడ్డే శ్రీనివాసరావు, ముత్తారం గ్రామసర్పంచ్ తాళ్ల నాగయ్య, ఎంపీటీసీ సభ్యురాలు దమ్మాలపాటి సరస్వతి, తాటికొండ రమేష్, మీగడ నాగేశ్వరరావు, మండెపూడి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.