Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదల ఇండ్ల స్థలాలకై పోరు
- అంబేద్కర్ విగ్రహాన్ని అవమానిస్తే తోలుతీస్తా.
పాదయాత్రలో భట్టి
నవతెలంగాణ-ముదిగొండ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానిస్తున్నాడని సీఎల్పీ నేత మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఘాటుగా విమర్శించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఐదో రోజు మండలంలో మల్లన్నపాలెం, పమ్మి, కమలాపురం, అయ్యగారిపల్లి, బాణాపురం గ్రామంలో ఆయన గురువారం పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన పాదయాత్ర సభల్లో ఆయన మాట్లాడారు. ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్, ఉపాధిహామీ నిధులు పక్కదారి పట్టిస్తున్నారని, కేసీఆర్ విధానాలపై భట్టి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అభయహస్తం పేదలకు భరోసా పథకాన్ని కెసిఆర్ నిర్వీర్యం చేశారన్నారు. అమల్లో ఉన్న భారత రాజ్యాంగాన్ని పాలనా పరంగా అమలు చేయకుండా కొత్త రాజ్యాంగం అంటూ కేసీఆర్ నాటకాలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కెసిఆర్ అనుసరిస్తున్న వైఖరికి భారత రాజ్యాంగం అడ్డువస్తుందని, కెసిఆర్ రాజ్యాంగం అమలుచేసి ప్రజలను ప్రశ్నించేవారిని ప్రజాఉద్యమాలను అణచివేయాలని కేసీఆర్ చూస్తున్నారని ఆయన ఆటలు సాగవని భట్టి హెచ్చరించారు.రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేయటం భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనన్నారు. నిధులు నియామకాలు,ఉద్యోగాలు వస్తాయనే ఆశతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు అనేక సమస్యలతో అల్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హిట్లర్, నియంత పాలన కొనసాగుతోందన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని అవమానిస్తే తోలు తీస్తానని, పమ్మి గ్రామంలో అంబేద్కర్ను అవమానించి తొలగించారో అక్కడే అంబేద్కర్ విగ్రహాన్ని పునప్రతిష్ట చేసేందుకు కృషి చేస్తా అన్నారు. దళిత నిరుపేదల ఇళ్ల స్థలాలపై పోరు సల్పుతున్నన్నారు. సిపిఐ (ఎం) టిడిపి, ఎమ్మార్పీఎస్ నేతలు భట్టి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. పలుసమస్యలపై భట్టికి వినతిపత్రాలు అందజేశారు. భట్టి పాదయాత్ర 13 కిలోమీటర్ల వరకు కొనసాగింది.బాణాపురం చేరుకుని రాత్రి బస చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి దుర్గాప్రసాద్, నాయకులు రాయల నాగేశ్వరరావు, మహమ్మద్ జావిద్, మొక్క శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు దోబ్బల సౌజన్య,మండల అధ్యక్షులు గుడిపూడి ఝాన్సీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు, నాయకులు తాళ్ల శ్రీను, తాటికొండ రమేష్, బుల్లెట్ బాబు, మహమ్మద్ అజ్గర్, మల్లెల కందిమల్ల వీరబాబు, చిలకల రామకృష్ణ, నంద్యాల నరసింహారావు, కోలేటి నాగేశ్వరరావు, వడ్డె మాధవరావు, చిన్నపంగు శివ,రాయబారపు వీరబాబు పాల్గొన్నారు.