Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాడీవేడిగా ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ మీటింగ్
- అధికార - ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం
- రూ. 320 కోట్లతో బడ్జెట్
- ఇంత అభివద్ధి చేసినా విమర్శలా? : మంత్రి అజరు
నవతెలంగాణ- ఖమ్మంకార్పొరేషన్
ఖమ్మం నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం మేయర్ పునుకొల్లు నీరజ అధ్యక్షతన గురువారం వాడీవేడిగా జరిగింది. బడ్జెట్ ప్రతిపాదనలను కౌన్సిల్లో అధికారులు చదివి వినిపించిన అనంతరం సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో నగర అభివృద్ధిపై అధికార పక్షం సభ్యులు గొప్పగా వివరిస్తుండగా ప్రతిపక్ష సభ్యులు జోక్యం చేసుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. విపక్షాల డివిజన్లపై వివక్ష చూపుతున్నారని కాంగ్రెస్ కార్పొరేటర్లు దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మిక్కిలినేని మంజుల ఆరోపించారు. దీనిపై అధికార పక్ష కార్పొరేటర్లు కమర్తపు మురళి, కొత్తపల్లి నీరజ, కర్నాటి కష్ణ అభ్యంతరం తెలుపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
రూ.320 కోట్లతో బడ్జెట్..
ఖమ్మం నగరపాలక సంస్థ 2022-23 ఏడాదికి రూ.320.98 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఆర్ధిక సంవత్సరం కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయం, కార్పొరేషన్ ఖర్చుల నివేదికను అధికారులు కౌన్సిల్లో చదివి వినిపించారు. ఇంటి పన్నుల ద్వారా రూ.29.27 కోట్లు, స్టాంప్‌డ్యూటీ ద్వారా రూ.5.02 కోట్లు, నగర పాలక సంస్థ భవనాలపై అద్దెల ఆదాయం రూ.13.39 కోట్లు, పబ్లిక్ హెల్త్ ద్వారా రూ.2.07కోట్లు, పట్టణ ప్రణాళిక విభాగం ద్వారా రూ.19.20 కోట్లు, ఇంజనీరింగ్ విభాగం ద్వారా రూ.2.17 కోట్లు, డిపాజిట్స్ అండ్ లోన్స్ ద్వారా రూ.2.50 కోట్లు, ప్రణాళికేతర నిధులు రూ.28.82 కోట్లు, ప్రణాళిక నిధులు రూ.100.95కోట్లు, ఇతర నిధులు రూ.117.59 కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో చూపించారు. ఇక 2022-23 ఆర్ధిక సంవత్సరంలో నగర పాలకసంస్థ నుంచి రూ.320.73 కోట్లు ఖర్చులు అవుతాయని అంచనా వేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలకు రూ.25.05 కోట్లు, పారిశుద్ధ్యంకు రూ.7.47 కోట్లు, విద్యుత్‌చార్జీలకు రూ.9.20 కోట్లు, రుణాల చెల్లింపునకు రూ.1.77 కోట్లు, గ్రీన్బడ్జెట్కు రూ.8.78 కోట్లు, ఇంజనీరింగ్ విభాగం నిర్వహణకు రూ.4.15కోట్లు, సాధారణ పరిపాలన వ్యయం రూ.4.11కోట్లు, పట్టణ ప్రణాళిక విభాగం వ్యయం రూ.70లక్షలు, విలీన గ్రామాలకు రూ.3.30 కోట్లు, పబ్లిక్ ఇమిటెన్స్ వ్యయం రూ.35 లక్షలు, వార్డు బడ్టెట్ కు రూ.5.99 కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్స్ రుణాల చెల్లింపునకు రూ.2.50 కోట్లు, ప్రణాళికేతర నిధులు రూ.28.82కోట్లు, ప్రణాళిక నిధులు రూ.100.95కోట్లు, ఇతర నిధులు రూ.117.59కోట్లు ఖర్చు అవుతాయని పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌కు పాలకవర్గం ఆమోదం తెలపగా.. దీనిని ప్రభుత్వ ఆమోదం కోసం అధికారులు పంపించనున్నారు.
మాటల యుద్ధం
బడ్జెట్ ప్రతిపాదనలను కౌన్సిల్లో అధికారులు చదివి వినిపించిన అనంతరం సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా అధికార పార్టీ కార్పొరేటర్ కమర్తపు మురళి మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఖమ్మం నగరం అభివద్ధి జరిగిందన్నారు. నగరంలో మంత్రి పువ్వాడ అజరుకుమార్ సారథ్యంలో అభివద్ధి పనులు వేగంగా జరిగాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మిక్కిలినేని మంజుల జోక్యం చేసుకొని నగరంలో అభివద్ధి ఎక్కడ జరిగిందో తమ డివిజన్లకు వచ్చి చూడాలన్నారు. అధికార పార్టీ కార్పొరేటర్లు, ప్రతిపక్ష కార్పొరేటర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభా సంప్రదాయాలను తెలుసుకుని ప్రవర్తించాలని అధికార కార్పొరేటర్లు ప్రతిపక్ష సభ్యులకు సూచించారు. ఎన్నిసార్లు లేఖలు పెట్టినా తమ డివిజన్లలో అభివద్ధికి నిధులు కేటాయించడం లేదని, సమాధానం చెప్పాల్సింది మేయర్ అని.. అధికార పార్టీ కార్పొరేటర్లు ఎందుకు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రశ్నించారు. రౌడీయిజం చేయడానికి వచ్చారా..? అని ప్రతిపక్ష కార్పొరేటర్లని... అధికార పార్టీ కార్పొరేటర్లు ప్రశ్నించారు.. ఎవరు రౌడీయిజం చేస్తున్నారో.. సమావేశాల వీడియోలను పరిశీలించుకోవాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు పేర్కొన్నారు. దీనిపై మేయర్ మాట్లాడుతూ అభివద్ధి జరిగిందని, అందరికీ నిధులు కేటాయించామని, అన్ని డివిజన్లకు రూ.25 లక్షల చొప్పున అభివద్ధి పనులకు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కార్పొరేటర్ క్ల్కెమెంట్ మాట్లాడుతూ నగరం అభివద్ధి చెందుతోందన్నారు. అభివద్ధి పనులు నాణ్యతతో జరిపించాల్సిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారని, సమస్యల కోసం ఫోన్ చేసినా డీఈలు పోన్లు ఎత్తడం లేదన్నారు. సమస్యలు చెప్పినా స్పందించడం లేదన్నారు.
గతంతో పోలిస్తే ఎంతో అభివృద్ధి : మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మంనగరం గతంతో పోలిస్తే చాలా అభివృద్ధి చెందిందని, బయట నుంచి ఖమ్మం వచ్చిన వారు అభివద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారన్నారు. కానీ కొందరు మాత్రం నగరానికి శాపంగా మారారని, ఇంత అభివృద్ధి జరిగినా విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, అనంతరం ప్రజలందరూ కలిసి ఉన్నట్టే.. ప్రజా ప్రతినిధులు కలిసి ఖమ్మం నగరాభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. లాక్డౌన్ సమయంలో కూడా నగరంలో అభివృద్ధి పనులు ఆగలేదని, రోడ్లు వేసుకోవడం, కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలు అందించామ న్నారు. శానిటేషన్ కార్మికులు గొప్ప సేవలు చేశారన్నారు. మున్సిపాలిటీగా ఉన్నప్పుడు వార్డుకు రూ.2లక్షల నిధులు కూడా కేటాయించే వారు కాదని, ఇప్పుడు కోట్ల రూపాయల నిధులు డివిజన్లో అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం మున్సిపాలిటీగా ఉన్నప్పటి నుంచి చిర్రావూరి, గెల్లా కేశవరావు, రాపర్తి రంగారావు, అఫ్రోజ్ సమీనా వంటి పెద్దలు పాలన చేశారని, నాటి నుంచి కార్పొరేషన్‌గా రూపాంతరం చెందే వరకు ఖమ్మం అభివద్ధి చెందుతూ వచ్చిందన్నారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా ఖమ్మం నగర పాలక సంస్థ నుంచి ఆదాయం పెంచుకునేలా కార్పొరేటర్లు, అధికారులు పనిచేయాలని, ప్రజలు పన్నులు చెల్లించేలా కార్పొరేటర్లు అవగాహన కల్పించాలన్నారు. 7న జరిగే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఖమ్మంకు తీపి కబురు తీసుకొస్తానని తెలిపారు. ఇప్పటికే ఖమ్మం నగరంలో గోళ్లపాడు చానల్ ఆధునికీకరణ ద్వారా అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టమ్‌కు అడుగులు పడ్డాయని, రానున్న రోజుల్లో నగరమంతా ఈ సిస్టమ్ తీసుకురావాలన్నారు. నగరంలో డ్రెయినేజీ వ్యవస్థను పటిష్టం చేసుకునేలా కార్పొరేటర్లు దృష్టి సారించాలన్నారు.
మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి పువ్వాడ అజరుకుమార్ సారథ్యంలో నగరం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. నగర అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు. బడ్జెట్‌పై, నగర అభివద్ధికి కౌన్సిల్ సభ్యులంతా సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి బడ్జెట్ సమావేశాలు కావడంతో అధికారులు కౌన్సిల్ సభ్యులకు, అధికారులకు బ్యాగులను అందజేశారు. సమావేశంలో కలెక్టర్ వీపీ గౌతమ్, కమిషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ కమిషనర్ మల్లీశ్వరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.