Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా పడిపోయిన ధర
- రెండు నెలల క్రితం కిలో రూ.60..ప్రస్తుతం కిలో రూ.14
- 25 కేజీల బాక్స్ గతంలో రూ.250.. ప్రస్తుతం రూ.80
- తలపట్టుకుంటున్న స్థానిక రైతులు
- ఎకరానికి రూ.50వేలకు పైగా నష్టం
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఈ ఏడాది ఏ పంట తీసుకున్నా నష్టాలలోనే రైతు కొట్టుమిట్టాడుతున్నాడు. అది మాగాణి, మెట్ట, ఉద్యాన... పంటలేవైనా రైతుకు కష్టాలు తప్పడం లేదు. చీడపీడలతో ముఖ్యంగా తామర నల్లి అన్ని పంటలనూ గుల్ల చేసింది. కూరగాయ పంటలను సైతం ఇది వదిలి పెట్టలేదు. తామర పురుగు ధాటికి టమాట రైతు తీరని నష్టాలను చవిచూశాడు. పండాకు తెగులు సైతం ఈ పంటను ఆశించింది. తద్వారా దిగుబడులు భారీగా పడిపోయాయి. దిగుబడులు సరిగా లేని సమయాన సాధారణంగా టమాట ధరలు అధికంగా ఉండాలి. కానీ దీనికి భిన్నంగా పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. రెండునెలల క్రితం రైతుబజార్లో కిలో రూ.60 వరకు పలికిన టమాట ప్రస్తుతం రూ.14 మాత్రమే పలుకుతోంది. హౌల్‌సేల్ మార్కెట్లో25 కేజీల వరకు ఉండే బాక్స్ (కేస్) నవంబర్, డిసెంబర్ నెలల్లో రూ.250 వరకు పలకగా ఇప్పుడు రూ.80- 100 వరకు మాత్రమే పడుతోందని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది రబీలో వరి వేయొద్దనడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఉద్యానపంటల సాగుపై దృష్టి సారించారు. ముఖ్యంగా కూరగాయ పంటలు సేద్యం చేశారు. దీనిలోనూ అత్యధికంగా టమాటను రైతులు వేశారు.
- గతేడాది కంటే 20% అత్యధిక సాగు...
గతేడాది (2020-21) ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2.28 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేయగా ఈ ఏడాది 2.96 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. దీనిలో కూరగాయలు గతంలో 13వేల ఎకరాల్లో వేయగా ఈ ఏడాది (2021-22) 16వేల ఎకరాల్లో సేద్యం చేశారు. దీనిలో దాదాపు 30% వరకు టమాట ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతేడాది 8వేల ఎకరాల్లో కూరగాయ పంటలు సాగు చేయగా..ఈ సంవత్సరం 10వేల ఎకరాల్లో వేశారు. దీనిలో సుజాతనగర్, జూలూరుపాడు, కొత్తగూడెం, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి, ఇల్లెందు, అశ్వాపురం, ఆళ్లపల్లి, బూర్గంపాడు, ములకలపల్లి, మణుగూరులో ఎక్కువగా సేద్యం చేశారు. ఖమ్మం జిల్లాలో గత సంవత్సరం 5వేల ఎకరాల్లో కూరగాయ పంటలు వేయగా ఈ ఏడాది ఆరువేల ఎకరాల్లో సాగు చేశారు. జిల్లాలో రఘునాథపాలెం, కొణిజర్ల, కూసు మంచి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కామేపల్లి, కారేపల్లి, చింతకాని, ముదిగొండ, బోనకల్, ఎర్రుపాలెం, తల్లాడ, వైరా, కల్లూరు తదితర మండలాల్లో టమాట అధిక మొత్తంలో సేద్యం చేశారు. డిసెంబర్లో వేసిన పంట ఇప్పుడు దిగుబడి వస్తోంది. దశలవారీగా కాకుండా రైతులందరూ ఒకేసారి టమాట విత్తనాలు నాటడంతో ఇప్పుడా ఉత్పత్తి వస్తోంది.
- టమాట పెట్టుబడి వివరాలు..
టమాట ఎకరానికి రూ.80వేల వరకు ఈ ఏడాది పెట్టుబడి పెట్టినట్లు రైతులు చెబుతున్నారు. విత్తనాలు 8 ప్యాకెట్లు (ఒక్కోక్కటి 10గ్రాములు) రూ.5,600, దున్నుడు కూళ్లు రూ.12వేలు, మల్చింగ్ పేపర్‌కు రూ.16వేలు, అడుగుమందులు, పై మందులకు రూ.40వేల వరకు, కోత కూలి బాక్స్‌కు రూ.20, ఆటోచార్జి రూ.30 మొత్తం రూ.80వేల పెట్టుబడి పెడితే రూ.లక్ష కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.
- ఒకేసారి దిగుబడితో ధరల పతనం
తెగుళ్లతో దిగుబడి పడిపోయినా ఉన్న కొద్దిపాటి పంట కూడా ఒకేసారి దిగుబడి వస్తుండటంతో ధరలు పడిపోతున్నాయని హౌల్‌సేల్ కూరగాయ మార్కెట్ కమీషన్ ఏజెంట్లు చెబుతున్నారు. ఖమ్మం హౌల్‌సేల్ మార్కెట్‌కు అన్‌సీజన్‌లో కర్నాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్నూల్ నుంచి దిగుమతి చేసుకునే వారు. ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్ రైతులకు టమాట లాభాల పంట పండించిందంటున్నారు. అక్కడి రైతులు బాక్స్ రూ.1,500 వరకు అమ్మినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం స్థానిక దిగబడులు మార్కెట్‌కు వస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి టమాట ఇక్కడికి వస్తోంది.
- నెల రోజులు ఇదే పరిస్థితి
తోట రామారావు, కూరగాయల కమీషన్ ఏజెంట్, ఖమ్మం
ప్రస్తుతం హౌల్ సేల్ మార్కెట్‌కు వస్తున్న టమాట అంతా స్థానికంగా పండించిందే. స్థానిక దిగుబడులు వస్తుండ టంతో ధర పతనం అవుతోంది. ఈనెల మొత్తం ఇదే పరిస్థితి ఉంటుంది. నవంబర్, డిసెంబర్లో బాక్స్ రూ.300కు పైగా పలికింది. ప్రస్తుతం రూ.80-100 వరకు పడుతోంది. ఏప్రిల్ నాటికి ధరలు పుంజుకుంటాయి. అప్పటికీ మన దగ్గర వాతావరణం వేడెక్కడంతో పంట దిగుబడి రాదు. అప్పుడు కర్నాటక, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి దిగుమతి చేసుకోవాలి. స్థానిక రైతులకు పెద్దగా గిట్టుబాటయ్యే పరిస్థితి లేదు. కోత, రవాణా కూళ్లు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.
- ఎకరానికి రూ.50వేలు నష్టం
అజ్మీరా రెడ్డి, సూర్యాతండా, రఘునాథపాలెం.
నాకున్న మూడెకరాల్లో వానకాలం పుచ్చకాయ వేశా. దానికి దానికి బూడినయి. డిసెంబర్లో టమాట వేసినా. ఎకరానికి రూ.80వేలకు పైగా ఖర్చయింది. పొయినేడు ఎకరానికి రూ.లక్షన్నర దాక వచ్చినయి. ఇప్పుడు రూ.50వేలు నష్టపోయేటట్టున్నా. అప్పుడు వెయ్యి బాక్స్‌లు వస్తే...ఇప్పుడు 200 బాక్స్‌ల పంట రావడమే కష్టంగుంది. బాక్స్ కాయల కోతకూలి రూ.20, ఆటోచార్జి ఒక్కోదానికి రూ.30తో మార్కెట్‌కు టమాటలు తీసుకుపోతే బాక్స్‌కు రూ.80 పెడతన్నారు. ఇంక మిగిలేదేడీ. ఎకరానికి రూ.30వేలు నష్టమే.
- దశలవారీగా నాటాలి..
జీనుగు మరియన్న, ఉద్యాన అధికారి, ఉమ్మడి ఖమ్మం జిల్లా
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది టమాట సాగు విస్తీర్ణం పెరిగింది. దాదాపు మూడువేల ఎకరాలకు పైగా ఈ పంటను గతంకంటే అధిక మొత్తంలో సేద్యం చేశారు. అయితే రైతులంతా ఒకేసారి పంట వేయడం, దశలవారీగా కాకుండా ఒకేసారి విత్తనాలు నాటడం వల్ల పంట దిగుబడులు ఇప్పుడే వస్తున్నాయి. డిసెంబర్లో వేసిన పంట ఇప్పుడు దిగుబడి వస్తుంది కాబట్టి ధరలు మందగించాయి. మూడు ఎకరాలున్న రైతులు నెలల వ్యవధితో మూడెకరాల్లో మూడుసార్లు విత్తనాలు నాటాలి. పైగా రైతులంతా ఒకే కూరగాయ పంటలు కాకుండా స్థానికంగా దొరకని పంటలు వేయడం ఉత్తమం.