Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశాంత్ కిశోర్ (పీకే) సర్వేపై భిన్నస్వరాలు
- ఉమ్మడి జిల్లా గులాబీ శ్రేణుల్లో ఆందోళన
- నిర్ధిష్టత లేదని పలువురి విమర్శలు
- సోషల్ మీడియాలో ఎవరికి వారు అనుకూల పోస్టులు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సర్వే నిపుణుడిగా పేరొందిన ప్రశాంత్ కిశోర్ టీం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పదికి పది అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని సర్వే తేల్చినట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ఈ సర్వే చేయించినట్లు చర్చ నడుస్తుండటంతో గులాబీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. అస్సలు ఈ సర్వే చేశారా? లేదా? చేస్తే ఏమీ తేలింది? ఈ సర్వే రిపోర్టు ఎలా ఉంది? సర్వే చేసినవారు పీకే టీం సభ్యులేనా? లేదా మరేదైనా యూట్యూబ్, డిజిటల్ మీడి యా బృందమా? ఇలాంటి అంశాలేవీ పరిగణలోకి తీసు కోకుండా ఎవరికి వారు ఈ సర్వేను తమకు అనుకూ లంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తదనుగు ణంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రజల్లో ఓ చర్చకు తెరదీశారు. 'నిజం గడపదాటే లోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టివస్తుంది' అనే సామెతలాగా పీకే సర్వే పై చర్చ సాగుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
నిర్ధిష్టత సంగతేంటి...?
పీకే బృందం సర్వేలో వెల్లడించిన అంశాల్లో నిర్ధిష్టత ఎంత మేరకు అనేది కూడా సందేహాస్పదంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదో జనరలైజ్డ్ సర్వేగా అభివర్ణిస్తున్నారు. ఏయే పథకాల అమల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందో...సాధారణ జనం మధ్య జరుగుతున్న చర్చనే పీకే బృందం సర్వే ఫలితంగా వెల్లడించిందనే విమర్శ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పోడు భూముల సమస్య ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్టీ రిజర్డ్ స్థానాలు. భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు, వైరా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోడు భూములు అత్యధికంగా ఉన్నాయి. ఫారెస్టు అధికారుల దాడులతో ఏజెన్సీ వాసులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. జగమెరిగిన ఈ విషయాన్ని వెల్లడించేందుకు ప్రత్యేకంగా ఓ సర్వే తేల్చడంపై విమర్శ ఉంది. గులాబీ పార్టీలో వలస వాదుల ఆధిపత్యం, డబుల్ బెడ్రూంల్లో అవినీతి, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ సమస్య, భృతి, దళితబంధుపై సందేహాలు, వివిధ పథకాల అమల్లో అధికార పార్టీ నేతల ప్రమేయం...ఇవన్నీ ప్రభుత్వంపై వ్యతిరేకతకు సంకేతాలుగా జనం చర్చించుకుంటున్నారు. కమ్యూనిస్టు పార్టీల మద్దతు, పొంగులేటి, తుమ్మల తదితర నేతల పార్టీల మార్పు, దేశీయంగా, రాష్ట్రస్థా యిలో చోటుచేసుకునే రాజకీయ పరిణామాలు... ఇలాంటి అంశాలను సర్వేలో ఏమేరకు పరిగణలోకి తీసు కున్నారనే విషయం తెలియకుండా పీకే సర్వేపై సర్వత్ర చర్చ జరపడంలో అర్థం లేదని ఓ ప్రముఖ టీఆర్ఎస్ నాయకుడు పేర్కొన్నారు. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన ఓ ప్రముఖ సర్వే సంస్థ ఇలాంటి నిర్ధిష్టత లేని సర్వే నిర్వహిస్తోందని తాను భావించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి జిల్లాలోనే కాదు రాష్ట్రస్థాయి లోనూ గులాబీ పార్టీపై వ్యతిరేకత వాస్తవమని మాత్రం ఆయన అంగీకరించారు. ప్రభుత్వ వ్యతిరేకతను విపక్షాలు ఏమేరకు సొమ్ము చేసుకుంటాయనే దానిపైనే కారు పార్టీ భవితవ్యం ఆధారపడి ఉందని అంటున్నారు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న మొత్తమ్మీద ఈ సర్వే గులాబీ శ్రేణులను మాత్రం తీవ్ర భయాందోళనకు గురిచేసినట్లు చెబుతున్నారు.
సర్వే నిజమేనా...?
ఆ మధ్య పీకే టీం ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల సర్వే నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వారు పీకే బృందమా? కాదా? అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఇలాంటి విషయాలేవీ తెలియకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేయడమే ప్రశాంత్ కిశోర్ ప్రత్యేకతగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సర్వే నిర్వహణలో నిజానిజాలు ఎలా ఉన్నా...సోషల్ మీడియాలో మాత్రం టీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఏ నేత అనుచరులు ఆ నేతకు అనుకూలంగా తెగ పోస్టులు పెడుతున్నారు. దీనిలో భాగంగా ఈసారి మధిర టీఆర్ఎస్ టిక్కెట్ విషయంలో తెగ వాదనలు వినిపిస్తున్నాయి. జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజ్కు అనుకూలంగా ఆయన అనుచరులు పోస్టులు పెట్టారు. ఆయనకు ఈసారి టీఆర్ఎస్ టిక్కెట్ దక్కదని. పొంగులేటి వర్గీయులకే టిక్కెట్ ఖాయమని, వారైతేనే గెలుస్తారని పీకే బృందం సీఎంకు నివేదించినట్లు మాజీ ఎంపీ అనుచరులు కౌంటర్ ఇచ్చారు. మధిర టీఆర్ఎస్ టిక్కెట్ విషయంలోనే మరో చర్చ కూడా నడుస్తోంది. గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి సత్తుపల్లి నుంచి విజయం సాధించిన సండ్ర వెంకటవీరయ్యకు ప్రస్తుతం అక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వేలో తేలినట్లు చర్చ సాగుతోంది. వరుస విజయాలు సాధిస్తున్న సీఎల్పీ నేత భట్టిని ఓడించేందుకు సండ్ర వెంకటవీరయ్యను మధిర నుంచి బరిలో నిలుపుతే ఉపయోగమని సర్వేలో తేలిందని కొందరు అంటున్నారు. మాజీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్లో వర్గపోరు మాత్రం తీవ్రంగా ఉంది. ఇదే ఆ పార్టీ పుట్టిముచ్చుతుందని సర్వే ఫలితంగా పేర్కొంటున్నారు. మరోవైపు ఈ సర్వేను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టిపారేస్తున్నారు. పదికి పది స్థానాల్లో కారు జోరు చూపుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.