Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఈఓ సోమశేఖర శర్మ
నవతెలంగాణ-అశ్వారావుపేట
విద్యార్ధుల్లో పఠనాసక్తి తగ్గడానికి ఉపాధ్యాయుల అలసత్వే కారణమని, కనీసం చూసి చదవడం రాయడం కూడా నేర్పకపోతే ఎలా అంటూ డీఈఓ సోమశేఖర శర్మ అసంతృప్తి వ్యక్తం చేసారు. మన ఊరు-మన బడి పధకం అమలులో భాగంగా ఎంపికైన పాఠశాలలను ఆయన మండలంలో తనిఖీ చేసారు. ముందుగా అచ్యుతాపురం ప్రాధమిక పాఠశాలలో ఒకటి, రెండో తరగతుల విద్యార్ధుల పఠనా ప్రతిభను పరీక్షించారు. ఆ విద్యార్ధులు కనీసం చూసి కూడా చదవలేక పోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసారు. విద్యార్ధులకు ఏమి చెప్తున్నా, ఎలా చెప్తున్నారో వారి చదవడాన్ని బట్టే అర్ధం అవుతుందని అన్నారు. పాఠ్యాంశాల బోధనాపై దృష్టి సారించాలని ప్రధానోపాధ్యాయురాలు కమలకు సూచించారు.
జిల్లా పరిషత్ ఉన్నత బాలికలు పాఠశాలలో విధ్యార్ధినిలను గణిత, ఆంగ్ల పాఠ్యాంశాలలో ప్రతిభను పరీక్షించారు. వారు సక్రమంగా స్పందించక పోవడంతో ఉపాధ్యాయులు ''క్లాస్ హెల్త్ చెక్'' చేస్తూ ఉండాలని ప్రధానోపాధ్యాయురాలు అమృత కుమారికి సూచించారు. మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి బోధనా క్రమాన్ని ప్రిన్సిపాల్ సంగీతను అడిగి తెలుసుకున్నారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని పరిశీలించారు. పాఠశాలను పధకం నిధులతో అభివృద్ధి చేసుకోవాలని ప్రధానోపాధ్యాయుడు పత్తేపరపు రాంబాబుకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీలు ప్రభాకరాచార్యులు, మాలోత్ రామారావు, దారెళ్ళి రామారావులు పాల్గొన్నారు.