Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆక్రమణదారుడి చేతిలో 3ఎకరాల ప్రభుత్వ భూమి
- అధికారులతో కుమ్మక్కు...ప్రతీ సంవత్సరం మరింత ఆక్రమణకు యత్నం
- అధికారుల మౌనం వెనకా ఆంతర్యమేంటో...!
- ఫిర్యాదులు చేసినా పట్టించుకోని ఉన్నతాధికారులు
నవతెలంగాణ-పాల్వంచ
ఇళ్లులేని నిరుపేద జానెడు నీడకోసం ప్రభుత్వ భూమిలో చిన్న గుడిసే వేసుకుంటే వెంటనే స్పందించి రెవెన్యూ అధికారులు తొకగిస్తారు. కానీ ఏకంగా 3 ఎకరాల పైచిలుకు ప్రభుత్వ అసైన్మెంట్ భూమిని కబ్జా చేసి రెవెన్యూ అవినీతి అధికారులతో భూ ఆక్రమదారుడు కుమ్మక్కై రూ.కోటి విలువ చేసే భూమిని నిబంధనలకు విరుద్ధంగా అక్రమపట్టా పాస్ పుస్తకాలు దక్కించుకోవడమే కాకుండా దాని పక్కనే ఉన్న మరింత భూమిని సంవత్సరానికి ఒకసారి డోజర్లతో మరింత కబ్జాకు పాల్పడుతూ రెవెన్యూ అధికారులకే సవాలు విసురుతున్నాడు. గిరిజన చట్టాలను సైతం అతిక్రమించి ఓసీ అయిన ఆ కబ్జాదారుడు భూ ఆక్రమణకు పాల్పడుతున్నా రెవెన్యూ ఉన్నతాధికారులు సైతం ఈ భూమిపై చర్యలు తీసుకోకపోవడంలో తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ అసైన్మెంట్ భూములను కబ్జా కాకుండా కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదే. వెంటనే కబ్జాదారులపై చర్యలు తీసుకుని స్వాధీనపరుచుకోవాలని ఆదేశించినప్పటికీ పాల్వంచ రెవెన్యూ అధికారులు మాత్రం ఆ కబ్జాదారుడికి అండగా నిలుస్తూ అత్యున్నత న్యాయస్ధానం నుండి స్టే ఇవ్వకుండా ఉన్నప్పటికీ ఆ భూమిని స్వాధీనపరుచుకోవడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. అసలు పాల్వంచలో రెవెన్యూ వ్యవస్థ ఉన్నదా లేదా అనే సందేహం నెలకొంది. తహసీల్దార్‌గా మారిన ప్రతీ అధికారిని కలిసి ఆమ్యామ్యాలు ముట్టజెప్పడంతో చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రభుత్వ భూమి భూకబ్జాదారుడిపై నవతెలంగాణ ప్రత్యేక కథనం.
పాల్వంచ పట్టణ పరిధిలో 1967లో గ్రామపంచాయతీగా ఉన్న పాల్వంచలో సర్వే నెంబర్ 727 ప్రభుత్వ భూమిలో ఇళ్లులేని పేదలకు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జలగం వెంగళ్రావు ఇండ్ల స్థలాలు మంజూరు చేశారు. 1987లో పాల్వంచ మున్సిపాలిటీగా అవతరించిన తర్వాత వెంగళ్రావు కాలనీలోని అర్బన్ డెవలప్మెంట్ స్కీం ద్వారా మిగిలిన 3 ఎకరాల 10 కుంటలు అభివృద్ధి చేయాలని మున్సిపాలిటీ ఈడబ్ల్యూజి 11/91 లేఅవుట్ ప్రకారం ప్లాన్ తయారు చేసి వరదనీరు పారే మిగులు భూములను గుర్తించి ఆ కాలనీలో అన్నివర్గాలకు ఆహ్లాదాన్ని పంచే ఒక పార్కును కేటాయించారు. ఈ పార్కును అధికారులు డెవలప్ చేయకపోవడంతో వరదనీరు పారుతున్న ఈ భూమిలో గడ్డి పెంచుకుంటూ భూమి తనదే అని అందరిని నమ్మించి ఓ ప్రబుద్ధుడు తన ఆదీనంలోకి తెచ్చుకున్నాడు. 2013లో ఈ భూమిని రూ.60 లక్షలు అమ్మేందుకు సిద్దమవుతుండడంతో ఆవిషయం తెలుసుకున్న కాలనీలోని హనుమాన్ యువజన సంఘం అధ్యక్షులు ఆరుద్ర సత్యనారాయణ ఆనాడు ఉన్న మస్తాన్‌రావుకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన తహసీల్దార్ భూమి అమ్మినజనార్ధన్రెడ్డి అనేవ్యక్తి ఆక్రమణలో ఉందని ఇది పార్కు స్థలం అని 7 నోటీస్ జారీ చేసి (ఇది ప్రభుత్వ భూమి అని గుర్తించి ఖాలీ చేయాలని) ఆ అధికారి వేరే ప్రాంతానికి బదిలీ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన మరో తహసీల్దార్ రాజేశ్వరి 2014లో ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్ 727 తెలిసినా గిరిజనచట్టం అమలులో ఉన్నప్పటికీ ఒక ఒసి ఆక్రమణదారుడికి పట్టా పాస్‌పుస్తకాలు అక్రమంగా జారీ చేసి బదిలీ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన మరో తహసీల్దార్ సమ్మిరెడ్డి రాఘవరెడ్డిలకు అనేకసార్లు ఈ అక్రమ భూమిపై ఫిర్యాదు అందినా స్వాధీనపరుచుకుంటామని ప్రకటనలు ఇస్తూ ఆనాడు తహసీల్దార్ మస్తాన్‌రావు ఇచ్చిన 7 నోటీస్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీళ్ల తర్వాత వచ్చిన గాన్యానాయక్ ఈభూమిపై వీఆర్వో ఆర్ఐలతో రీ సర్వే చేయించారు. ఈ సర్వేలో ప్రభుత్వ అసైన్డ్ భూమిని అక్రమంగా పట్టా జారీ అయిందని ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టం చేస్తూ పై అధికారులకు నివేదిక ద్వారా తెలిపారు. దీంతో 6 నోటీస్ మద్రాస్ యాక్ట్ 111 జివో ఆఫ్ 1905 ప్రకారం జివో జారీ చేసి 7 రోజుల్లో భూమి ఖాలీ చేసి బయటకు వెళ్లాలని సమ్మె జనార్ధన్‌రెడ్డి అనే కబ్జాదారుడికి నోటీసు ఇచ్చారు. వెంటనే తనవద్దఉన్న పట్టా పాస్‌బుక్‌తో కోర్టును ఆశ్రయించి స్టే ఇవ్వాలని కోరడంతో కోర్టు పాల్వంచ తహసీల్దార్ కార్యాలయానికి వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో తహసీల్దార్ రూల్ నెంబర్ 42 ఆఫ్ 1359 ఎఫ్ ప్రకారం ఈ భూములకు గిరిజన చట్టాలు వర్తిస్థాయిన ఇది ప్రభుత్వ భూమి అని ఆధారాలతో ఇది పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నందున ఇతనికి అసైన్మెంట్ చేసినట్లు లేదని ఈ భూమి పోడు చేయబడలేదని కోర్టులకు అధికారులు తెలపడంతో ఈ కబ్జాదారుడికి స్టే ఇవ్వలేదు. అయినప్పటికీ ఆభూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనపరుచుకోకుండా సంవత్సరాల తరబడి తాత్సారం చేయడంలో ఆంతర్యం ఏంటని విమర్శలు వస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లినప్పటికీ నిబంధనలు ప్రకారం ఈ భూమిని తక్షణమే రెవెన్యూ అధికారులు స్వాధీనపరుచునే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ఇదే అదనుగా భావించిన కబ్జాదారుడు ఇటీవల చుట్టుపక్కల మరింత మిగులు భూములకు ప్రొక్లైన్‌తో చదునుచేసి దర్జాగా కబ్జా చేసి రెవెన్యూ అధికారులకే సవాలువిసురుతున్నాడు. కబ్జాచేస్తున్న సమయంలో స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అక్కడికి చేరుకున్న ఆర్ఐ జేసిబిని పట్టుకుని వెంటనే వదిలేసారు. వాస్తవంగా జేసిబిని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌లో పెట్టాల్సిన అధికారులు అలాంటివి ఏమి చేయకుండా వదిలేయడమే కాకుండా ఆ కబ్జాదారుడికి అండగా నిలుస్తున్నారనే విమర్శలు పాలవుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో అసలు వ్యవస్థ నడుస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఈ ప్రభుత్వ భూమిని ప్రత్యేకంగా విజిట్ చేసి ఆ భూమిని స్వాధీనపరుచుకుని ఇళ్లు లేని 3 వేల మందికి పైగా ఉన్నారని వారికి ఇండ్ల స్థలాల కింద కేటాయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
727 సర్వేనెంబర్లో భూ అక్రమాలపై విచారిస్తున్నాం
727 సర్వేనెంబర్లో బోరు ఆక్రమాలపై విచారణ జరుపుతున్నాం. అందిన ఫిర్యాదు మేరకు ఉన్నతాధి కారులకు నివేదిక అందజేశాం. అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
- తహసీల్దార్ స్వామి