Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతంలో డిపాజిట్ చెల్లించిన వాళ్లకు ఇవ్వాలి
- ప్రైవేట్ వేలం టెండర్లు రద్దు చేయాలి
- జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్‌కి సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం నగరంలో సుమారుగా పది సంవత్సరాల క్రితం నిర్మించిన 756 రాజీవ్ స్వగృహా ఫ్లాట్లను వెంటనే మధ్య తరగతి ప్రజలకు, గతంలో డిపాజిట్ చెల్లించిన చిరుద్యోగులకు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్‌ను సీపీఐ (ఎం) ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ కోట్లాది రూపాయల ప్రజల సొమ్ముతో నిర్మించిన గృహాలు చిరుద్యోగులకి కానీ, మధ్యతరగతి ప్రజలకు కానీ అందించకుండా కార్పొరేట్ సంస్థలకు ప్రైవేటు వేలం వేయడం సరైంది కాదన్నారు. ఖమ్మం నగరంలో అనేక మంది మధ్య తరగతి ప్రజలు సొంత ఇండ్లు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. ఒక పక్క మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే కోట్ల రూపాయల ఖర్చు పెట్టి నిర్మించిన ఇళ్లను శిథిలావస్థకు చేరుకునే వరకు చూడడం హాస్యాస్పదమన్నారు. గతంలో అనేక మంది చిరుద్యోగులు, మధ్యతరగతి ప్రజల నుండి రు.3500 నుండి 5 వేల వరకు డిపాజిట్లు సేకరించారని వారు గుర్తు చేశారు. తక్షణమే గృహాలను అర్హులైన వారికి అందించాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా ప్రైవేటు వ్యక్తులకు టెండర్లు పిలిచి అప్పనంగా అప్పచెప్పే ప్రక్రియ మానుకోవాలని హెచ్చరించారు. ప్రైవేటు వ్యక్తులకు వేలం రూపంలో గృహాలు కట్టబెట్టే టెండర్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాస్, ఎస్.నవీన్‌రెడ్డి, దొంగల తిరుపతిరావు, నాయకులు తుశాకుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.