Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-గాంధీచౌక్
నేడు సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపే శాస్త్రీయ పరిష్కార మార్గం మార్క్సిజం ఒకటేనని, ఇప్పటి వరకు దీనికి ప్రత్యామ్నాయం నిరూపించిన సిద్ధాంతం లేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక సిపిఎం త్రీటౌన్ కార్యాలయంలో పార్టీ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ జనరల్ బాడీ సమావేశంలో నున్నా మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో కేరళలో పార్టీ 23 జాతీయ మహాసభలు జరుగుతున్నాయన్నారు. మహాసభలలో దేశవ్యాప్తంగా పార్టీ తీసుకోబోయే రాజకీయ వైఖరులపై అఖిలభారత మహాసభల ముసాయిదా రాజకీయ తీర్మానాన్ని విడుదల చేసిందన్నారు. ఈ ముసాయిదా తీర్మానంలో నేడు ప్రపంచ వ్యాప్త పరిస్థితులపై, దేశవ్యాప్త సమస్యల పైన భవిష్యత్తులో తీసుకోబోయే పోరాటాల గురించి ముసాయిదా పేర్కొనడం జరిగిందన్నారు. సామాన్య ప్రజలకు అందు బాటులో ఉండేలా ఆయా ప్రాంతీయ భాషల్లో అనువదించి చర్చకు ప్రజల ముందు ఉంచడం జరిగిందన్నారు. మార్క్సిజం ఆధారంగా ఒక నిర్దిష్టమైనటువంటి రాజకీయ తీర్మానాన్ని తీసుకొని పని చేసేటటువంటి పార్టీ సిపిఎం మాత్రమే అన్నారు. సాధారణ పౌరులు సైతం అధ్యయనం చేసి తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు అన్నారు. పార్టీ వేసిన అంచనాలలో ప్రపంచంలో, దేశంలో అసమానతలు చాలా తీవ్రంగా పెరుగుతున్నాయన్నారు. కేవలం 10 శాతం మంది దగ్గర ప్రపంచ సంపద పోగు పడుతుందన్నారు. ఈ సంపద కేంద్రీకరణ ఫలితమే నేడు ప్రపంచ దేశాలు ఎదుర్కొం టున్న నిరుద్యోగం, సంక్షోభాలు, ప్రజల కష్టాలకు కారణం అన్నారు. వీటి పరిష్కారం మార్క్సిజాన్ని అర్థం చేసుకొని దీని అమలుకు పూనుకోవ డంలోనే ఉందన్నారు. ఇందుకోసం పార్టీ అన్ని స్థాయిల్లో శ్రేణులకు రాజకీయ వైఖరిపై చర్చ చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అర్థం చేయించడం, ప్రజా పోరాటాలను ఉధృతం చేయడం ద్వారా మాత్రమే అసమానతల్ని రూపు మాపగలం తప్ప ఇంతకు మించి వేరే పరిష్కారం ఇప్పటివరకు కనుగొనబడలేదు అన్నారు. ఇందుకోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
త్రీ టౌన్ పార్టీ కార్యదర్శి భూక్య శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ జనరల్ బాడీలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు బండారు యాకయ్య, నాయకులు తుశాకుల లింగయ్య, పత్తిపాక నాగ సులోచన, శీలం వీరబాబు, వజినేపల్లి శ్రీనివాసరావు, ఎస్కే సైదులు, బండారు వీరబాబు, కార్పొరేటర్ యల్లంపల్లి వెంకట్రావు, ఎస్.కె ఇమామ్, నాయకులు పాశం సత్యనారాయణ, వేల్పుల నాగేశ్వరరావు, రంగు హనుమంత చారి, బెట్టి పుల్లయ్య, ఎస్.కె కాసిం, తమ్మినేని రంగారావు, సిద్దుల రాజు, మీనాల మల్లికార్జున్, బుజ్జి, పేరయ్య, మద్ది శ్రీను, పిట్టల లక్ష్మీనారాయణ, యర్రా నగేష్, జంగం నగేష్ తదితరులు పాల్గొన్నారు.