Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధిలో ఆదర్శం
- అద్దంలా మెరుస్తున్న రహదారులు
- హరితతోరణంగా వీధులు
- పారిశుధ్యంపై పంచాయతీ యుద్ధం
నవతెలంగాణ-కారేపల్లి
అభివృద్ధి, ప్రజాచైతన్యంలో ఆదర్శంగా నిలుస్తూ భలా భజ్యాతండా అనిపించుకుంటుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా చేస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ ఆభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుంది. కారేపల్లి మండలం ఉమ్మడి విశ్వనాధపల్లి నుండి విడివడి తర్వాత భజ్యాతండా పంచాయతీ రూపురేఖలే మారిపోయాయి. నూతన పంచాయతీ ఏర్పడిన తర్వాత సర్పంచ్ బానోత్ సంధ్యారాందాస్ సారధ్యంలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలో ముందుకు పోతూ మండలంలోని పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తుంది. పారిశుధ్యంపై యుద్దం ప్రకటించిన పాలకవర్గం పంచాయతీలో అపరిశుభ్రంగా వీధులను అద్దంగా మెరిసేలా చేస్తున్న తీరును అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పంచాయతీలో రహదారుల వెంట నడవాలంటే ముక్కులు ముసుకోని వెళ్లాల్సిన పరిస్ధితిలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకునేల సర్పంచ్ బానోత్ సంధ్యారాందాస్ చైతన్యం చేశారు. పంచాయతీలోని మధునగర్, బొక్కలతండా, భజ్యాతండా గ్రామాల్లో రహదారులను చూస్తే అభివృద్ధికి పాలక వర్గం చేస్తున్న శ్రమ తెలుస్తుంది.
పరవశించేలా పల్లెప్రకృతి వనం
పల్లె ప్రకృతి వనంను దర్శించిన వారు పరశించేలా పార్కును తీర్చిదిద్దారు. తీరొక్క చెట్లను నాటి వాటి పోషణపై ప్రత్యేక శ్రద్దపెట్టారు. పట్టణం పార్కులా తలపిస్తున్న పల్లె ప్రకృతి వనంలో గ్రామస్తులు తీరిక వేళ్లలో సేదతీరేలా తీర్చిదిద్దారు. మన ఊరు మన నర్సరీని ఏర్పాటు చేసి గ్రామస్తుల డిమాండ్ మేరకు అన్ని రకాల మొక్కలను పెంచుతున్నారు. వీధులు హరితతోరణంలో తలపించేలా గ్రామస్తులను భాగస్వాములను చేస్తూ వీధుల వెంట వెంట మొక్కలను నాటారు.
ఆర్ధిక భారం భరిస్తూ రాజీ లేకుండా అభివృద్ధి : సర్పంచ్ బానోత్ సంధ్యారాందాస్
పంచాయతీ అభివృద్ధిలో ప్రజల సహకారంతో ఎంతో ఉంది. పంచాయతీకి వచ్చే నిధులను పొదుపుగా వినియోగిస్తూ కేవలం పంచాయతీ నిధులు రూ.10 లక్షలతో సీసీ రోడ్లను వేయటం జరిగింది. ప్రభుత్వ బిల్లుల చెల్లింపులో జాప్యం అయినా ఆర్ధిక భారం భరిస్తూ పంచాయతీ అభివృద్ధిలో రాజీ పడకుండా చేస్తున్నాము. పంచాయతీకి వచ్చే నిధులు అధికంగా ట్రాక్టర్ కిస్తీ, డీజిల్, వేతనాలు, విద్యుత్ బిల్లులకే పోతున్నాయి. అయినా పోదుపు చర్యలతో అభివృద్ధి సాధిస్తున్నాము. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ సహకారంతో ఆర్ అండ్ బీ రోడ్ నుండి భజ్యాతండా వరకు ఆర కిలోమీటర్ బీటీ రోడ్డు, పంచాయతీలో సైడ్ డ్రైనేజీల నిర్మాణంకు కృషి చేస్తున్నాను.
నర్సరీలో 15 వేల మొక్కల పెంపకం : బీ.రాకేష్, పంచాయతీ కార్యదర్శి
మన ఊరు మన సర్సరీలో ప్రజా డిమాండ్ మేరకు 15 రకాల మొక్కలను పెంపకం చేస్తున్నాము. ప్రధాన రహదారుల వెంట మొక్కలను నాటుతూ హరితహారంకు ప్రాధాన్యత ఇస్తున్నాము. పారిశుధ్యంపై రాజీ లేకుండా చేయటంతో వీధులు శుభ్రంగా ఉంటున్నాయి. చెత్త సేకరణ ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాము.