Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుబ్రహ్మణ్య స్వామితో కేసీఆర్ భేటీ వెనుక కుట్ర ఇదే..
- మిర్చి రైతుల సమస్యలపై అసెంబ్లీలో గళం వినిపిస్తా
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణ- ముదిగొండ
భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఏకంచేసే పనిలో కేసీఆర్ ఉన్నాడని, దానిలో భాగంగానే ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న సుబ్రహ్మణ్యస్వామిని కలిశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికై... ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర శుక్రవారం 6వ రోజుకు చేరుకుంది. మండలంలోని బాణాపురం, వల్లభి, మల్లారం గ్రామాల్లో నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభలలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానాలను అమలు చేయడం కోసమే రాజ్యాంగాన్ని మార్చాలని ఇటీవల కేసీఆర్ ఢిల్లీ వెళ్లి రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తున్నాడన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న సుబ్రమణ్య స్వామితో కేసీఆర్ సమావేశం అవ్వడం వెనుక ఇదే కుట్ర దాగి ఉందని వివరించారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులను తిప్పికొట్టడానికి లౌకికవాదులు, ప్రజాస్వామికవాదులు ఏకం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్లు నటించి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించలేని సీఎం కేసీఆర్ జాతీయస్థాయిలో రైతు సమస్యలపై ఉద్యమిస్తామని టీకాయత్తో సమావేశం అవ్వడం ''కూటీలో రాయి తీయలేనోడు..ఏట్లో రాయి తీస్తున్నట్లుగా'' ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో వరి వేస్తే ఉరే అని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ధాన్యం కొనుగోలు మీద కేంద్రంతో యుద్ధం చేయాలని జాతీయ స్థాయి రైతులతో భేటీ అవ్వడం తెలంగాణ రైతులను మభ్య పెట్టడం కోసమేనని అన్నారు.
భట్టి పాదయాత్రకు కల్లుగీత కార్మికులు స్వాగతం
భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర శుక్రవారం 6వ రోజు మండలంలోని బాణాపురం నుంచి వల్లభి గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో పాదయాత్రకు తాటి వనాల వద్ద కల్లుగీత కార్మికులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.రోడ్డు పక్కన వారు వేసుకున్న పాకలోకి భట్టినీ తీసుకెళ్ళారు. గీత కార్మికుడు వత్సవాయి కుటుంబరావు గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. ప్రభుత్వం తాటిచెట్లు ఎక్కడానికి ఎలక్ట్రానిక్ మోకులు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదన్నారు. మత్స్య కార్మికులు చేపలు పట్టుకుని అమ్మడానికి టీవీఎస్ లూనాలను ప్రభుత్వం ఇచ్చిందని, తమకు కూడా ఇవ్వాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన సభ్యులందరికీ లైసెన్సులు ఇవ్వడం లేదన్నారు.తాటి చెట్టుపై నుంచి పడి చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు ఏడాదైనా ఎక్స్గ్రేషియా రావడంలేదని తెలిపారు. తాటి వనాల పెంపకం కోసం ప్రభుత్వం సొసైటీలకు కేటాయిస్తామని ప్రకటించిన మూడు ఎకరాల భూమి కూడా ఇవ్వకపోవడంతో భవిష్యత్తులో తమ వృత్తి మనుగడ లేకుండా పోయే ముప్పు ఉందని వివరించారు. తమ సమస్యలను ఏకరువు పెట్టిన తర్వాత గీత కార్మికులు సీఎల్పీ నేతను కల్లు రుచి చూడాలని బ్రతిమిలాడారు. వారి అభిమాన ఒత్తిడికి ఆయన కల్లు రుచి చూశారు.
మిర్చి రైతుల సమస్యలపై అసెంబ్లీలో గళం వినిపిస్తా''....
తామర చీడతో నష్టపోయిన రైతులు పడుతున్న బాధలపైన రైతుల గొంతుకగా అసెంబ్లీలో తన గళం వినిపిస్తానని భట్టి విక్రమార్క మిర్చి రైతులకు భరోసా ఇచ్చారు.ముదిగొండ మండలం బాణాపురం నుంచి వల్లభి గ్రామానికి పాదయాత్ర గా వస్తున్న సీఎల్పీ నేతను మార్గమధ్యంలో మిర్చి రైతులు కలిశారు.తమ మిర్చి పంట పొలాల వద్దకు ఆయనను తీసుకువెళ్లారు.''కౌలుకు తీసుకుని ఎకరానికి రెండు లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టితే చేనుకు రోగం వచ్చి 2 క్వింటాలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదన్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడంతో పాటు కౌలు చెల్లించడానికి చిల్లిగవ్వ లేదని, అప్పుల బాధకు తాళలేక పురుగుల మందు తాగి చావలనిపిస్తుందని ''రైతు వత్సవాయి వీరబాబు నాగమణి దంపతులు సిఎల్పి నేతకు తమ గోడును చెబుతూ బోరున విలపించారు.చావు సమస్యకు పరిష్కారం కాదని మనోధైర్యం కల్పించారు. ''మీలాంటి రైతులు టిఆర్ఎస్ పాలనలో పడుతున్న బాధలను చూసి, తెలంగాణలో ఏఒక్కరు సంతోషంగా లేరని భావించి తెలంగాణ ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన నాయకుడిగా, మీ సమస్యల పరిష్కారం కోసమే పీపుల్స్ మార్చ్ మొదలు పెట్టానని'' భట్టి తెలిపారు. తన అడుగులో అడుగు వేసి ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రగతి భవన్ గేట్లను బద్దలు కొట్టడానికి కదం తొక్కాలని కోరారు. తొలుత బాణాపురం గ్రామంలో బోనాలతో కోలాటం ప్రదర్శిస్తూ మహిళలు పాదయాత్ర నేత భట్టికి ఘన స్వాగతం పలికారు.ఆయా గ్రామాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహాలకు పూలతో మల్లు భట్టి విక్రమార్క ఘనంగా నివాళులర్పించారు. పలు ప్రజాసమస్యలపై భట్టికి వినతిపత్రాలు ప్రజలు అందజేశారు. 11కిలోమీటర్ల మేర విక్రమార్క పాదయాత్ర కొనసాగింది. మల్లారం గ్రామం చేరుకొని రాత్రి బస చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్ రెడ్డి,అమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు మల్లు నందిని,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి దుర్గాప్రసాద్, నాయకులు రాయల నాగేశ్వరరావు, మొక్క శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షుడు దొబ్బల సౌజన్య, మండల అధ్యక్షులు గుడిపూడి ఝాన్సీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు, నాయకులు బుల్లెట్ బాబు, బాణాపురం, మల్లారం గ్రామసర్పంచ్లు ఆవుల రమలక్ష్మారెడ్డి, దాసరి స్వామి, నాయకులు ఆవుల అప్పిరెడ్డి, వట్టికూటి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యులు బిచ్చాల బిక్షం, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు బిచ్చాల అన్వేష్, పల్లపాటి కృష్ణ, చిలకల రామకృష్ణ, మహమ్మద్ అజ్గర్, వడ్డెల్లి వీరరాఘవులు, పనితి పాపారావు, చెరుకుపల్లి రాంబాబు, పందిరి అంజయ్య, కందిమల్ల వీరబాబు, గుడిపూడి బుచ్చిరామయ్య, చిర్ర లింగయ్య, వల్లూరి భద్రారెడ్డి, ఇలవల పుల్లారెడ్డి, వీరారెడ్డి, మట్టా బాబురాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.