Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని చిన్న తరహా నీటి వనరులు మున్నేరు, కట్టలేరు, వైరా నదులకు సంబంధించి ముదిగొండ, చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం, తల్లాడ మండలాల్లో నిర్వహిస్తున్న ఇసుక రీచ్ ల ద్వారా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వెయాలన్నారు. ఇందుకు పోలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఒకే కూపన్ ద్వారా ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా నియంత్రించాలన్నారు. ఇందుకు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, సి.సి కెమెరాల నిఘాతో వాహనాల తనిఖీ చేయాలన్నారు. ప్రభుత్వ పరంగా జరిగే నిర్మాణ పనులు సి.సి రోడ్లు, డబుల్ బెడ్రూమ్ గహాలు, చిన్న తరహా కట్టడాలకు స్థానిక అవసరాలకు ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు. అక్రమ రవాణా జరిపే వాహనాలపై జరిమానాలను విధించాలని, వాహనాలకు నిర్దేశించిన సమయాన్ని కచ్చితంగా పాటించాలన్నారు. ప్రధానంగా రాత్రివేళలు ఇసుక రవాణాను పూర్తిగా కట్టడి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జి.పి.ఎస్ విధానాన్ని అమలుపర్చడం ద్వారా ఇసుక అక్రమరవాణాను పూర్తిగా నియంత్రించ గలుగుతామన్నారు. మట్టి అక్తమ తవ్వకాలపైనా నిఘా పెంచాలన్నారు. ప్రభుత్వ స్థలాలు ఉన్న గుట్టలను తహశీల్దార్ల ద్వారా గుర్తించి మట్టి త్రవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పోలీసు కమిషనర్ విష్ణు.యస్. వారియర్ మాట్లాడుతూ ఒకే కూపను అనేక పర్యాయాలు వినియోగిస్తున్న వాహనాలను గుర్తించి అట్టి వాహనాలను సీజ్ చేయా లన్నారు. రెవెన్యూ, పోలీసు అధికారుల సమన్వయంతో ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా కట్టడి చేయవచ్చని సూచించారు. అక్రమ నిల్వల ప్రదేశాలను గుర్తించి నిల్వలను సీజ్ చేయడంతో పాటు బాధ్యులపై చట్టపర చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో ఇసుక అక్రమ డంపింగ్యార్డులను పూర్తిగా అరికట్టాలని సూచించారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, అడిషనల్ డి.సి.పి అడ్మిన్, లా అండ్ ఆర్డర్ గౌస్ ఆలం, ఏ.సి.పిలు బోస్, స్నేహ మెహరా, ఎన్. వెంకటేశ్, మైనింగ్ ఏ.డి జి. సంజరు కుమార్, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు శ్రీనివాసరావు, ఖమ్మం, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, ముదిగొండ, చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం, తల్లాడ మండలాల తహశీల్దార్లు, ఎస్.హెచ్.ఓలు సమావేశంలో పాల్గొన్నారు.