Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - బోనకల్
తన పొలానికి పాస్ బుక్ ఇవ్వాలని ఓ రైతు కుటుంబం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించింది. అనంతరం తాసిల్దార్ రావూరి రాధిక హామీతో ఆందోళన విరమించారు. బాధిత రైతు బొల్లెపోగు వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని జానకిపురం గ్రామానికి చెందిన బొల్లెపోగు వెంకటేశ్వర్లు చిన్న బీరవల్లి రెవిన్యూ పరిధిలో గత కొన్ని సంవత్సరాల క్రితం చిన్న బీరవల్లి గ్రామానికి చెందిన కాపు భాస్కర్ రావు వద్ద ఒక ఎకరం పొలం కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించి పాసు బుక్ కూడా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సాదాబైనామా పాస్ బుక్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ సమయంలో రెవెన్యూ కార్యాలయం నుంచి వెంకటేశ్వర్లుకు నోటీసు కూడా ఇచ్చారు. అయితే ఆన్ లైన్ మాత్రం నమోదు కాలేదు. తనతో పాటు సాదాబైనామాలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ పాసుబుక్ లు వచ్చాయి. కానీ అతనికి పాస్ బుక్ రాకపోవటంతో రెండు మూడు సార్లు కార్యాలయం చుట్టూ కూడా తిరిగాడు. అయితే ప్రభుత్వం ధరణి లాక్ చేయడం వల్ల వెంకటేశ్వర్లకి కొత్త పాస్ బుక్ రాలేదు. దీంతో వెంకటేశ్వర్లు తన కుటుంబంతో కలిసి తనకు పాస్ బుక్ ఇవ్వాలని తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగాడు. దీంతో తాసిల్దార్ రావు రాధిక స్పందిస్తూ సాదాబైనామా సమయంలో మీ పొలానికి సంబంధించి ఆన్లైన్ కాకపోవటం వల్ల పాసుబుక్ రాలేదని ప్రభుత్వం ధరణి వెబ్ సైట్ ఓపెన్ చేయగానే వెంటనే సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా వారం పది రోజులలో భూమి సర్వే కూడా చేయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతు కుటుంబం ఆందోళన విరమించింది. కార్యక్రమంలో సిపిఎం మధిర పట్టణ మాజీ కార్యదర్శి పాపినేని రామనర్సయ్య తోటకూర వెంకటయ్య వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.