Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణంకు
ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి
- సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ - వైరాటౌన్
వైరా మండలంలో నిర్మాణం మధ్యలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగించాలని, స్వంత స్థలాలలో ఇండ్లు నిర్మాణం కోసం ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం వైరా మండలం గరికపాడు గ్రామంలో నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయాన్ని సిపిఐ(ఎం) బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా నిర్మాణం పూర్తి కాకపోవడంతో గ్రామాలలో లబ్దిదారులకు ఇండ్లను అప్పగించే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఇసుక, సిమెంట్, ఇనుము ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఇండ్లు నిర్మాణం కోసం ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు సహాయం అందించాలని, మూడు లక్షల రూపాయలు వలన లబ్దిదారులకు అప్పులు పెరిగి స్థలంతోపాటు ఇండ్లను కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడుతూ వైరా నియోజకవర్గ పరిధిలో కొన్ని గ్రామాలలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి అయిన లబ్దిదారులకు అప్పగించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి స్వంత స్థలాలలో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మాణం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, నేరుగా లబ్ధిదారులకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని ప్రకటించి మూడు సంవత్సరాల సమయం గడిచినా జీవో జారీ చేయలేదని, వెంటనే డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మాణంకు సంబంధించిన ప్రభుత్వా మార్గదర్శకాలు సవరణ చేసి అర్హులు అందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు మాగంటి తిరుమలరావు, శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.