Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య
నవతెలంగాణ- ఖమ్మం
నగరంలోని 58వ డివిజన్లోని దళిత మహిళ భూలక్ష్మి , ఆమె భర్త, కుమార్తె, కుమారులపైన 58వ డివిజన్ కార్పొరేటర్ అనుచరులు విచక్షణా రహితంగా దాడి చేయడమే కాకుండా మహిళ కుటుంబంపై కులం పేరుతో తిట్టి, మహిళల అని చూడకుండా ఛాతి పైన కాలుతో తన్ని, అమె కూతురు బట్టలను చింపి దాడి చేయడాన్ని జిల్లా కాంగ్రెస్ మహిళ కార్పొరేటర్లు, జిల్లా నాయకులు తీవ్రంగా ఖండించారు. సోమవారం దాడికి గురైన దళిత మహిళను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, మహిళా కార్పొరేటర్లులు బాధిత మహిళను పరామర్శించి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గుంతలతో ఉన్న రోడ్డుపైన గ్రావెల్ మట్టిని పోయాలని అడిగినందుకు దళితురాలైన భూలక్ష్మిపై, ఆమె కుటుంబంపై ఆ ప్రాంత కార్పొరేటర్ అనుచరుడైన సాయి ప్రోద్బలంతో తమ అనుచరులను ఉసిగొల్పి దాడి చేయడాన్ని ఖండించారు. ఇటీవలనే సర్జరీ ఐన మహిళ అని చూడకుండా దాడి చేయడం దుర్మార్గమని, తక్షణమే పోలీసులు దాడి ఘటన వివరాలను విచారించి దోషులైన కార్పొరేటర్ అనుచరులైన సాయి, యాదగిరి, నాగేశ్వరరావు, ఇతరులను తక్షణమే కస్టడీలోకి తీసుకొని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో 5వ డివిజన్ కార్పొరేటర్ పల్ల బోయిన భారతి, 57 వ డివిజన్ కార్పొరేటర్ రఫీ ద బేగం, నాయకులు దామా స్వరూపం, దేవత్ దివ్య, ఏలూరు రవి శంకర్, మిక్కిలినేని నరేంద్ర ,సత్యంబాబు తదితరులు పాల్గొన్నారు.