Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో
- కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-ఖమ్మం
బడ్జెట్లో ఖమ్మం జిల్లా యూనివర్సిటీ ప్రస్తావన తీసుకురాక పోవడానికి నిరసనగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పీజీ కళాశాల ఎదుట జిల్లా యూనివర్సిటీ అంశాన్ని బడ్జెట్లో చేర్చకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మధు, పిడిఎస్యూ జిల్లా అధ్యక్షులు నామాల ఆజాద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఇటికల రామకృష్ణ మాట్లాడుతూ విద్యా రంగానికి రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించకుండా మొండి చెయ్యిి, విద్య అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు, సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఏది అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పది జిల్లాలలో తొమ్మిది జిల్లాల్లో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, ఖమ్మం జిల్లా కేంద్రంగా జనరల్ యూనివర్సిటీ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని, బంగారు తెలంగాణను నిర్మిస్తామని చెప్పిన టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లా యూనివర్సిటీ విషయాన్ని చేర్చకపోవడం దుర్మార్గం అన్నారు. జిల్లా కేంద్రంలో జనరల్ యూనివర్సిటీ లేకపోవడం వలన కాకతీయ, ఉస్మానియా, శాతవాహన లాంటి విశ్వవిద్యాలయాలకు విద్యార్థులు వలస వెళ్లే పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లా పైన విద్యారంగ సమస్యల పైన కపట ప్రేమను చూపిస్తుందని వారు విమర్శించారు. పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యను అందని ద్రాక్షలా మార్చే కుట్రలో భాగంగానే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మూసివేసి వాటిస్థానంలో ప్రైవేట్ యూనివర్సిటీ లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలు మూసివేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ పేద విద్యార్థులకు ఉన్నత విద్య చదువుకునే అవకాశం కోల్పోతారని యూజీసీ నిబంధనల ప్రకారం యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించి యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ లెక్చరర్స్ పోస్టుల భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉమ్మడి జిల్లాలో జనరల్ యూనివర్సిటీ నెలకొల్పాలని, జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి యువరాజు, పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు మస్తాన్, నాయకులు , లక్ష్మణ్, సతీష్ రాకేష్ సాయి, గణేష్, శివ, రవితేజ తదితరులు పాల్గొన్నారు.